నల్గొండ-వరంగల్-ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ నల్గొండలో పద్మనాయక వెలమ పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్యఅతిథిగా హాజరైయ్యారు. ఈ సమావేశంలో ఆల్ ఇండియా వెలమ సంఘం అధ్యక్షుడు, శాసన మండలిలో ప్రభుత్వ విప్ కానిపర్తి భాను ప్రసాద్ రావు, మాజీ ఎంఎల్ఏ వేనేపల్లి చందర్ రావు, సూర్యాపేట జెడ్పీ చైర్ పర్సన్ గుజ్జ దీపికా యుగేందర్ రావు, తూముల రవీందర్ రావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. ఈ నల్లగొండ, వరంగల్, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం కోసం మనమంతా కృషి చేయాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచిన ఘనత సీఎం కేసీఆర్‌ది. 24గంటల కరెంటు, సాగు నీరు, ఎదురు పెట్టుబడిగా రైతు బంధు, రైతు భీమా ఇచ్చిన మహానుభావుడు కెసిఆర్ కాదా? రైతుల పంటలను కొనుగోలు చేసి, పెన్షన్లు ఇస్తూ, అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ వన్‌గా తీర్చిదిద్దిన ఘనుడు కెసిఆర్ అని మంత్రి కొనియాడారు. విమర్శించేవారు ఈ విషయాలను గమనించుకోవాలన్నారు.
నల్లగొండ జిల్లా చరిత్రలో ఫ్లోరైడ్ ని పారదోలిన, మంచినీటిని అందిస్తున్న మహానుభావుడు సీఎం కెసిఆర్. ఈ ఒక్క కారణం చాలు. సీఎం నిలిపిన పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించడానికి.. ఇంకా..1,32,899 ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినం. బీజేపీ ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? పెట్రోల్, డీజిల్, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. 100 రోజుల్లో నల్లధనం వచ్చిందా? మన ఖాతాల్లో 15లక్షలు పడ్డాయా? యూపీ, గుజరాత్‌లో భూములు ఇవ్వకున్నా, కోచ్ ఫ్యాక్టరీలు ఇచ్చారు. 150.05 ఎకరాల భూమి ఇచ్చినా తెలంగాణకు ఇవ్వలేదని మంత్రి దుయ్యబట్టారు.
దేశంలో 157 మెడికల్ కాలేజీలు ఇస్తే, ఒక్కటీ తెలంగాణకు ఇవ్వలేదు. పోనీ రాష్ట్రంలో 4 గురు ఎంపీ లున్న నియోజకవర్గాల్లో కూడా ఏమీ సాధించలేక పోయిన దద్దమ్మలు ఏవేవో మాట్లాడుతున్నారు. సీఎంను ఎవరైనా నిలదీస్తే, ఊరుకోవద్దు. నిలదీయాలి. మనమంతా ఏకగ్రీవంగా పల్లా రాజేశ్వర్ రెడ్డికి పూర్తి మద్దతుగా నిలవాలి. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించి సీఎం కెసిఆర్ గారికి కానుకగా ఇద్దామన్నారు. పల్లా మంచి తెలివైన వాడు.. వక్త. సీఎం కెసిఆర్‌కు దగ్గరి వాడు. ఆయన గెలవడం ఖాయం. కానీ ఆయన గెలుపులో మన పాత్ర కీలకంగా ఉండాలి. సవాల్‌గా తీసుకొని పని చేయాలని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా నలు మూలల నుంచి తరలి వచ్చిన వెలమ సామాజిక వర్గ ప్రజలు, ముఖ్యులు పాల్గొన్నారు.