బండి సంజయ్ ది ప్రజా సంగ్రామ యాత్ర కాదు…ఆత్మ వంచన, అబద్ధాల ప్రచార యాత్ర అని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచి నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మండిపడ్డారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై మంత్రి ఫైర్ అయ్యారు. ఈమంగళవారం హనుమకొండ అర్ అండ్ బి అతిథి గృహంలో ఆయన ప్రెస్ మీట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. బిజెపి బడా జూటా పార్టీ..బండి సంజయ్ కాదు తొండి సంజయ్ అని నువు చేస్తున్నది ప్రజా సంగ్రామ యాత్ర కాదు..ఆత్మ వంచన యాత్ర,అబద్ధాల ప్రచార యాత్ర అని దుయ్యబట్టారు.
ఎంపీ అయినవు కనీ నీ తెలివిని చూస్తుంటే కంపు కొడుతున్నది. నరేగా స్కీం తలా తెలవదు… తోకా తెలవదు.. నలుగురు చూసి నవ్వుకుంటున్నారన్న ఇంగితం కూడా లేదు. నోటికి ఎంత వస్తే అంతా? నీది నోరా? తంబాకు నమిలే తాటి మట్టా?..నీ మాటల మీద నిలబడతానని రాసిస్తావా? అని ఎర్రబెల్లి ప్రశ్నించారు. నలుగురిని పోగేసుకుని నాలుగు అబద్ధాలు అడిండు బండి సంజయ్. నరేగా (ఉపాధి హామీ పథకం) నిధులు 3 నెలలుగా రాలేదని కూలీలు చెప్పారట! ఆ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కెసిఆర్ ఆపారట?..ఆ నిధులను నేరుగా కూలీల ఖాతాల్లో వేయమని ఈ బోడి…ఆ మోడీకి రెకమెండ్ చేస్తడట?! కూలీల డబ్బులు వేసేది కేంద్రమే. రాష్ట్రం కాదని కూడా తెలవనోడు, తెలివి లేనోడు మాట్లాడితే ఎట్లా? అని బండిపై విమర్శలు చేశారు.
నిజానికి… ఉపాధి హామీ కూలీల డబ్బులు నేరుగా వారి పోస్టల్ ఖాతాలో కేంద్రమే జమ చేస్తది..రాష్ట్రం జోక్యం ఏమాత్రం ఉండదు. ఇప్పటి వరకు కూలీల డబ్బులు 232 కోట్లు కేంద్రం మన రాష్ట్రానికి బకాయి పడింది. మార్చి 31,2022 వరకు మాత్రమే కేంద్రం ఉపాధి కూలీల డబ్బులు వేసింది. నరేగా చట్టం ప్రకారం మస్టర్ రోల్ పూర్తయిన 15 రోజుల్లోనే డబ్బులు కూలీల ఖాతాలకు జమ చేయాలి. అయితే 34 రోజులు గడిచినా, కూలీల డబ్బులు ఎందుకు పడలేదు? ఈ విషయం సంజయ్ చెప్పాలె? పైగా అవి రాష్ట్రమే అపిందని అబద్ధాలు చెప్పుతున్నడు.ఏప్రిల్ 1,2022 నుండి ఉపాధి వేతనాన్ని 245 రూపాయల నుండి 257కు పెంచింది. 5 కి.మీ. పరిధి దాటితే మరో 10 శాతం అదనంగా ఇవ్వాలని సూచించింది. అంటే, 25 రూపాయల 70 పైసలు అదనంగా రికార్డు అవుతాయి. ఆ ప్రకారమే మనం రికార్డు చేస్తున్నం… ఇక ధన్వాడలో కూలీలకు పని దొరకడం లేదని బండి అబద్ధాలు చెప్పారు.
ధన్వాడలో దరఖాస్తు చేసుకున్న ప్రతి కూలీకి ఉపాధి పని కల్పిస్తున్నాం. ధన్వాడలో 310 మంది కూలీలు దత్తాత్రేయుని గుట్ట, సీతమ్మ గట్టు దగ్గర కందకాల పనులు చేస్తున్నారు. వాస్తవాలు ఇలా ఉంటే… సంజయ్ తొండి కూతలు కూస్తున్నాడు. తొండి సంజయ్ కు సవాల్ చేస్తున్నా… మోడీ దగ్గర మోకరిల్లి ఆయన బూట్లు నాకడం కాదు.. నీకు దమ్ముంటే… నీవు తెలంగాణ బిడ్డవే అయితే నీవు ఎంపీవన్న సోయి నీకు ఉంటే….నరేగా నిధులను ఎక్కువ తెచ్చే తెలివి నీకు ఎలాగూ లేదు.. కనీసం మొన్న కేంద్ర బడ్జెట్ లో 25వేల కోట్లకు కోత పెట్టిన నరేగా నిధులను వాపస్ తేవాలి అని మంత్రి సవాల్ చేశారు. ఎప్పటి నుంచో రాష్ట్రం కోరుతున్న విధంగా, నరేగాను వ్యవసాయానికి అనుసంధానం చేయించు..ఉపాధి కూలీల వేతనాలను మరింతగా పెంచిపియి.. ఈ తెలివి లేదు కనీ, ఉపాధి కూలీల సొమ్ము తినే వాళ్ళ లెక్కలు తేలుస్తడట? ఉపాధి కూలీల సొమ్ముకు బొక్క పెట్టి మెక్కుతున్నది కేంద్రంలోని మీ బీజేపి ప్రభుత్వమే కదా? అని మంత్రి ఎర్రబెల్లి ప్రశ్నించారు.
తెలంగాణలో అమలవుతున్న నరేగా పనులను అనేక రకాలుగా పరీక్షించి.. అద్భుతంగా పని జరుగుతున్నదని అభినందించింది మీ కేంద్ర ప్రభుత్వమే కదా?..నరేగా నిధులు వినియోగంలో దేశంలో మన రాష్ట్రమే నెంబర్ వన్ అని కేంద్రం చెప్పలేదా?..మన కూలీలకు మనం దేశంలో ఎక్కడా లేని విధంగా పనులు కల్పిస్తుంటే..నీ కండ్లకు కనిపించడం లేదా? అని ధ్వజమోత్తారు. కేంద్రం మన రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపై లెక్కలేనన్ని అవార్డుల ఇస్తున్నది. దేశంలోని మొదటి 10 ఆదర్శ గ్రామాలను లెక్క తీస్తే 10 కి 10 మనవే.. దేశంలోని మొదటి 20 ఆదర్శ గ్రామాల్లో 19 గ్రామాలు మనవే.. పార్లమెంట్ సభ్యులు దత్తత తీసుకున్న గ్రామాల్లో మనమే నెంబర్ వన్.. ఓడిఎఫ్ లో మనమే నెంబర్ వన్..పారిశుద్ధ్యంలో మనమే నెంబర్ వన్..ఆడిటింగ్ లో వరసగా రెండో సారి మనమే నెంబర్ వన్.. మిషన్ భగీరథ నీటిని 100 శాతం గ్రామాలకు అందించింది దేశంలో మనమే. మోయలేనన్ని ఆవార్డులు ఇచ్చిన మోడీతో… పిడికెడు నిధులు తెచ్చినా తొండి సంజయ్! అని దుయ్యబట్టారు మంత్రి ఎర్రబెల్లి.