బీజేపీ ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలి- ఎర్రబెల్లి

17
Minister Errabelli

మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండల టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ, పార్టీ సభ్యత్వాలు బాగా చేయాలి. ఈ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో యువతను బాగా వినియోగించాలి. బాగా సభ్యత్వం చేసిన వాళ్ళకు తగిన గౌరవం, సత్కారాలు చేద్దాం. అలాగే పని చేయని వాళ్ళని కూడా గౌరవించుకుందామని చమత్కరించారు. నిరుద్యోగ యువతను అన్ని విధాలుగా ఆదుకుందాం. ఇప్పటికే ప్రభుత్వ పరంగా 1 లక్షా 31 వేల మందికి ఉద్యోగాలు ఇచ్చాం. ప్రైవేట్ రంగంలో 2 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామన్నారు. మరి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజేపీ ఒక్క ఉద్యోగం ఇచ్చిందా? ప్రతి ఖాతా లో రూ.15 లక్షలు ఇస్తామని చెప్పారు? పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరుగుతూనే ఉన్నాయని మంత్రి విమర్శించారు. మేము మ్యానిఫెస్టోలో చెప్పినవే కాదు, చెప్పనివి కూడా అనేకం చేశాం. బీజేపీ దేశాన్ని ప్రైవేట్ వాళ్లకు అప్పగిస్తున్నది. సిగ్గులేకుండా ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. అలాంటి వాళ్ళను నిలదీయాలని మంత్రి మండిపడ్డారు.

మనం, మన పార్టీ, మన నేత ఏమి తప్పులు చేయలేదు. మనం ఎవ్వరికీ భయపడాల్సిన పని లేదు. పైగా ప్రజలకు బోలెడు చేశాం. బాగా బడాయిలు పోతున్న బీజేపీ ప్రజలకు చేసింది ఏమిటో చెప్పాలి. కోచ్ ఫ్యాక్టరీని అడిగితే, ఉత్తర ప్రదేశ్‌లో పెట్టీ, 1200 ఎకరాల స్థలం ఇస్తే, రూ.300 కోట్ల విలువ చేయని డబ్బాలు కడిగే, ఫ్యాక్టరీ ఇస్తారట. గిరిజన యూనివర్సిటీ అటే పోయింది. ఇంత నీచమైన కేంద్ర ప్రభుత్వాన్ని నేను నా జీవితంలో చూడలేదని ఎద్దేవ చేశారు. కేంద్రం కొత్తగా రైతు చట్టాలు తెచ్చింది. 12వేల కోట్లను మన రాష్ట్ర ప్రభుత్వం మన రైతుల తరపున విద్యుత్ బోర్డుకు కడుతున్నది. ఉచితంగా 24గంటలపాటు విద్యుత్‌ను ఇస్తున్నాం. కొత్త చట్టంతో ఏడాదికి ప్రతి రైతు మీద లక్ష రూపాయల భారం పడనున్నది. రైతుల పొలాలను అంబానీ, అదానీ లకు అప్పగించే కుట్ర చేస్తున్నది.

అదే సీఎం కెసిఆర్, రైతు పక్షపాతిగా అనేక కార్యక్రమాలు చేపట్టారు. దండుగ అనుకున్న వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగ చేశారు. అన్ని రకాల ప్రోత్సాహకాలు కల్పిస్తున్నది. సర్వాంగ సుందరంగా రాష్ట్రాన్ని సీఎం కెసిఆర్ బంగారు తెలంగాణ చేస్తున్నారు. ప్రజలకు ఈ విషయాలను చెరవేయాలి. పార్టీ సభ్యత్వంలో రాష్ట్రంలో మనమే నెంబర్ వన్ గా నిలిచే విధంగా పార్టీ బాధ్యులు సభ్యత్వాలు చేయాలి. పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. వార్డు, గ్రామ, మండల స్థాయిలో అనుబంధ సంఘాలు, సోషల్ మీడియా కమిటీలు వేయాలి. యూత్ కమిటీలు వేయాలి. పార్టీ కార్యకర్తలకు గుర్తింపు కార్డులు ఇచ్చే ఆలోచన పార్టీ చేస్తున్నది. పార్టీ కార్యకర్తలకు, సభ్యులందరికీ గ్రూప్ ఇన్సూరెన్స్ కట్టి, మరణించిన వాళ్ళ కు భీమా ఇస్తున్న పార్టీ దేశంలో టిఆర్ఎస్ ఒక్కటే. 60లక్షల సభ్యత్వం ఉన్న పార్టీ కూడా ఒక్క టిఆర్ఎస్ మాత్రమే. ఇంతగా కార్యకర్తలకు మేలు చేస్తున్న పార్టీ కూడా టిఆర్ఎస్ మాత్రమే. పార్టీ కార్యకర్తలే టిఆర్ఎస్ పార్టీకి బలం బలగం అన్నారు.

ఇలాంటి పార్టీని ఎవరైనా విమర్శిస్తే నిలదీయండి. సీఎం కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం చేసిన, చేస్తున్న అభివృద్ధిని ప్రజలకు చెప్పండి అని మంత్రి వివరించారు. పార్టీ సభ్యత్వం, వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో టీఆరెఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయమే లక్ష్యంగా పని చేయాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులకు పిలుునిచ్చారు. అనంతరం పార్టీ ముఖ్య నేతలకు మంత్రి ఎర్రబెల్లి పార్టీ సభ్యత్వం ఇచ్చారు. ఇప్పటి వరకు సభ్యత్వ నమోదులో ముందున్న నేతలను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఇంచార్జీ వలు జన్ను జకార్య, లింగంపల్లి కిషన్ రావు, పార్టీ స్థానిక ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలు, పార్టీ సభ్యత్వ బాధ్యులు, ముఖ్య కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.