మహాత్మాగాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం క్రింద రాష్ట్రానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 13 కోట్ల పనిదినాలు లక్ష్యంగా నిర్ణయించామని, అందులో ఇప్పటికే 9 కోట్ల 80 లక్షల పనిదినాలు కల్పించడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది, గ్రామీణ నీటి సరఫరా శాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తెలిపారు. హైద్రాబాద్‌లోని మినిస్టర్ క్యాంపు కార్యాలయం నుండి గురువారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సంధీప్‌కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ కమీషనర్ రఘునంధన్‌రావులతో కలిసి రాష్ట్రంలోని జిల్లా అదనపు కలెకర్లు, జిల్లా పరిషత్ సీఈవోలు, జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులు, జిల్లా పంచాయతీ అధికారులతో వెబ్ కాన్ఫరెన్స్ నిర్వహించి, గ్రామీణ ప్రాంతాల్లో పల్లెప్రగతి, వివిధ పథకాల అమలును మంత్రి సమీక్షించారు. గత సంవత్సరంలో ఈ సీజన్‌లో 17 లక్షల 50వేల కూలీలు పనిచేస్తే, ప్రస్తుత సీజన్‌లో ఇప్పటికే 25లక్షల 70వేల మంది ఉపాధి కూలీలు రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్నారని మంత్రి తెలిపారు.
ఈ సంవత్సరంలో ఏప్రిల్ నెలాఖరు వరకు లక్షకు పైగా జాబ్ కార్డులు ఇచ్చారని, ఈ కష్టకాలంలో కరోన విస్తరించి ఉన్నా.. ఎంతో కష్టపడి ఉపాధి హామీ పథకం కొనసాగిస్తూ ఎంతో మంది నిరుపేదలకు ఉపాధి కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు. ఉపాధి హామీ పథకం అమలుకు అహర్నిశలు కృషి చేస్తున్నఅధికారులను, ఉద్యోగులను ఈ సంధర్భంగా మంత్రి అభినంధించారు. కరోనా వ్యాప్తి వల్ల నగరాలు, పట్టణాల నుండి చాలామంది తమ స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారని, వారందరికి అవసరమైన జాబ్‌కార్డులు అందించి, ఉపాధి కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. త్వరలోనే వర్షాకాలం ప్రారంభం అవుతుందని, ఒక సారి వర్షాలు ప్రారంభం అయితే వ్వవసాయ పనులు ప్రారంభమవుతాయని, అందువల్ల వచ్చే 15 రోజుల్లో ఉపాధి హామీ పథకం క్రింద ఎక్కువ మంది కూలీలకు ఉపాధి కల్పించాలని సూచించారు. ప్రధాన పంట కాలువలు, ఫీల్డ్ చానల్స్‌ల పూడికతీత, వర్షాకాలం ప్రారంభం కాకముందే పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు. లాక్‌డౌన్ సమయంలో కూడా కఠినమైన కోవిడ్ నిబంధనలతో ఉపాధి హామీ పనులు కొనసాగుతున్నాయని మంత్రి అన్నారు.
వర్షాలు మొదలు కాగానే పారిశుధ్ధ్య సమస్యలు వస్తాయని, అందువల్ల గ్రామాల్లో పారిశుధ్ధ్య కార్యక్రమాలు చేపట్టడానికి కావాల్సిన బ్లీచింగ్, మిగతా రసాయనాలను సమకూర్చుకోవాలని మంత్రి సూచించారు. పారిశుధ్ధ్యంతోనే కరోనా కట్టడి చేయబడుతుందని, గ్రామాలలో పారిశుద్ధ్యంపైన పంచాయతీ సెక్రటరీలు పూర్తి శ్రద్ధ వహించాలని మంత్రి ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించబడుతున్న జ్వర సర్వేల్లో ఏయన్‌యం, ఆశా కార్యకర్తలతో పాటుగా పంచాయతీ సెక్రటరీలు చురుగ్గా పాల్గొనాలని మంత్రి కోరారు.
రాష్ట్ర వ్యాప్తంగా రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి 7400 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి తెలిపారు. ఐకేపి ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలు బ్రహ్మండంగా పనిచేస్తున్నాయని, ఈ విషయంలో జిల్లా గ్రామీణాభివృద్ది అధికారులు పూర్తిగా శ్రద్ధ తీసుకొని మే నెలాఖరులోగా వరి ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో 12వేల 766 చెత్తను వేరుచేసే షెడ్లు మంజూరి కాగా, ఇప్పటికే 12వేల 602 షెడ్ల పనులు పూర్తి అయ్యాయని తెలిపారు. ఆందులో11,566 చెత్తను వేరుచేసే షెడ్లు వినియోగంలోకి వచ్చాయని, మిగతా షెడ్లు వినియోగంలోకి వెంటనే తీసుకురావాలని ఆయన డిఆర్‌డివోలను కోరారు.
రాష్ట్రంలోని గ్రామాలలో 12వేల 756 వైకుంఠధామాలు(స్మశాన వాటికలు) మంజూరి కాగా, అందులో 11వేల 515 పూర్తి అయ్యాయని, 9వేల 140 వినియోగంలోకి వచ్చాయని మంత్రి తెలిపారు. అసంపూర్తిగా ఉన్న మిగతా వైకుంఠధామాల పనులు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకురావాలని మంత్రి కోరారు. హరితహరం కార్యక్రమంలో రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో గత ఆర్ధిక సంవత్సరంలో 18కోట్ల 48లక్షల మొక్కలు పెంచడం ద్వారా వంద శాతం లక్ష్యాన్నిసాధించామని ఆయన తెలిపారు. 2021-2022 సంవత్సరంలో వర్షాకాలం ప్రారంభం కాగానే మొక్కలు నాటడానికి కావాల్సిన మొక్కలను సిద్దంగా ఉంచుకోవాలని ఆయన కోరారు.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్ శాఖ అధికారులకు, సిబ్బందికి కోవిడ్ వ్యాక్సిన్ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా తెలిపారు. ఇంకా ఎవరైన తీసుకోని సిబ్బందితో పాటుగా ఈ.జి.యస్ సిబ్బందిని ఫ్రంట్‌లైన్ వర్కర్లుగా గుర్తించి కోవిడ్ వ్యాక్సిన్ వేయించాలని మంత్రి కోరారు. రాష్ట్ర ప్రభుత్వం సూపర్‌స్పైడర్లుగా గుర్తించిన వారికి కోవిడ్ వ్యాక్సిన్లు ఇవ్వాలని నిర్ణయించిందని, ఈ విషయంలో వైద్యారోగ్య శాఖ సిబ్బందికి, పంచాయతీరాజ్ అధికారులు, సిబ్బంది సహాయ సహకారాలు అందించాలని ఆయన కోరారు.
గ్రామాల్లో రాబోయే వర్షాకాలంలో ఎప్పటికప్పుడు శానిటైజర్ కార్యక్రమాలను చేపట్టాలని, పరిసరాలను శుభ్రంగా ఉండేందుకు చర్యలు తీసుకునే విదంగా జిల్లా స్థాయి అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ కమీషనర్ రఘునంధన్‌రావు కోరారు. పట్టణాల నుండి గ్రామాలకు వచ్చే కూలీలకు ఉపాధి కల్పించాలని ఆయన కోరారు.రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ డిప్యూటి కమీషనర్ రామారావు ఈ సమావేశంలో పాల్గొన్నారు.