కేంద్రం ఉపాధి హామీ నిధులు విడుదల చేయాలి- మంత్రి

130
minister errabelli
- Advertisement -

కేంద్రం నుండి రావాల్సిన PMGSY, మహాత్మాగాంధీ NREGS, RGSA నిధులను వెంటనే విడుదల చేయాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ జీ ని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోమవారం ఢిల్లీలో కలిసి కోరారు. PMGSY- 3వ విడతలో రాష్ట్రానికి రానున్న 2427.50km నుండి 4485km లకు పెంచాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. PMGSY- 2వ విడతలో 1794 KM అర్హత వుండగా కేవలం 971KM మాత్రమే మంజూరు చేశారని మంత్రి తెలిపారు. ప్రతి విడత విడతకు 25% పెంచాల్సి వుండగా తెలంగాణకు మంజూరులో అలా జరగలేదని అవన్నీ కలుపుకొని 4485km మేర 3వ విడత PMGSY రోడ్లు ఇవ్వాలని మంత్రి ఆ లేఖలో వివరించారు.

దీనికి సంబంధించిన వివరాలను రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి సమర్పించారు. ఇదే విషయమై 4-10-2019న రాష్ట్ర సీఎం కెసిఆర్ ప్రధానమంత్రి మోడీకి రాసిన లేఖ ప్రతిని కూడా మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కు అందించారు. తెలంగాణ నూతనంగా ఏర్పడిన రాష్ట్రం అని వెనుకబడిన ప్రాంతాలు అధికంగా ఉండడం వల్ల కొత్త రోడ్ల అవసరం వుందని ఇందుకు అనుగుణంగా రాష్ట్రానికి వాస్తవంగా రావాల్సిన PMGSY 3వ విడతలో 4485KM మంజూరు చేయాల్సిందిగా మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రి కి విజ్ఞప్తి చేశారు.

ఉపాధి హామీ నిధులు..

మహాత్మాగాంధీ NREGS రాష్ట్రంలోని 12,770 గ్రామపంచాయితీ లు, 540 గ్రామీణ మండలాలు, 32 జిల్లాలలో విజయవంతంగా అమలు అవుతున్నది. ఈ ఏడాది 30.5 లక్షల హౌజ్ హోల్డ్స్ కి చెందిన 52.9 లక్షల కూలీలకు పని కల్పించామని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రికి చెప్పారు. ఈనాటికీ 14.50 కోట్ల పనిదినాలు(96.7%) కల్పించి రూ. 15 కోట్ల బడ్జెట్ ను అందించగలిగామని మంత్రి తెలిపారు. ఈ పనుల నిమిత్తం కేంద్రం నుండి రూ. 2048.40 కోట్లు మెటీరియల్, పాలన కాంపోనెంట్ కింద అందాల్సి వుండగా ఇప్పటివరకు రూ. 1140.05 కోట్లు మాత్రమే అందాయని చెప్పారు. మిగితా 908.27 కోట్లు అందాల్సి ఉందన్నారు. ఈ నిధిని వెంటనే విడుదల చెయ్యాల్సిందిగా మంత్రి కేంద్ర మంత్రిని కోరారు.

RGSA నిధులు..

రాష్ట్రీయ గ్రామ స్వరాజ్య అభియాన్ (RGSA) పథకం 2020-21 ఏడాది కింద కేంద్రం వాటా రూ. 242.86 కోట్లు అందకపోవడం వలన ఆ పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయలేకపోతున్నామని వెంటనే ఆ నిధులను విడుదల చేయాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి కేంద్ర మంత్రి తోమర్ ని కోరారు. RGSA పథకం ద్వారా గ్రామాల్లో పంచాయితీ భవనాలు, మౌలిక వసతుల అభివృద్ది, సాంకేతిక సహకారం వంటి పలు పనులు చేపట్టనున్నారు.

- Advertisement -