రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు శుక్రవారం హన్మకొండలో తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ వరంగల్ జిల్లా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ సమ్మేళనానికి రాష్ట్ర, జిల్లా గెజిటెడ్ ఆఫీసర్ల సంఘం నేతలు పరిటా సుబ్బారావు, కారం రవిందర్ రెడ్డి, జగన్ మోహన్ రావు, ఫణి కుమార్, రాజేశ్ తదితరులతోపాటు ఉద్యోగ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ.. తెలంగాణ వస్తే అప్పుల పాలు అయితది అన్న తెలంగాణ నేడు ఏం అయంది? అబివృద్ధి దిశగా దూసుకుపోతోంది. బంగారు తెలంగాణ చేస్తున్న సీఎం కెసిఆర్‌పై, ఈ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న చిల్లర రాజకీయాలను మీరందరూ గమనించాలి. విభజన చట్టంలో ఉన్న కోచ్ ఫ్యాక్టరీ, బయ్యారం, విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నది. బంగారు తెలంగాణ నిర్మాణంలో ఉద్యోగులందరి కృషి మరువలేనిది. రాష్ట్రం అభివృద్ధి పథంలో సాగేందుకు ఉద్యోగులు చేసే పని విధానాన్ని సీఎం కెసిఆర్ ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్నారు.
కరోనా సమయంలో ఉద్యోగులు ఫ్రంట్ లైన్ వారియర్లుగా పని చేశారు. ఉద్యోగుల సమస్యలు కెసిఆర్ దగ్గరకు తీసుకుపోయి త్వరలోనే పరిష్కారం చేస్తామని హామీ ఇస్తున్నాను.ఉద్యోగులు తొందర పాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ఉద్యోగుల ఫిట్మెంట్ కరోనా కారణంగా ఆలస్యమైంది. అయినా, ఆంధ్రా కంటే, ఉద్యోగులు ఆశించిన దానికంటే కాస్త ఎక్కువగానే లబ్ధి పొందుతారు. ఆ శుభవార్త మరికొద్ది రోజుల్లోనే మీరు వింటారు. ప్రభుత్వానికి ఉద్యోగులు అండగా నిలవాలి. ఉద్యోగులకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి అన్నారు.