తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరూ తమ కుటుంబ వివరాలతోపాటు, ఆస్తుల వివరాలను కూడా తప్పకుండా నమోదు చేసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలుపునిచ్చారు. వరంగల్ లోని తన ఇంటి వివరాలను మంత్రి ఎర్రబెల్లి గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఆదివారం నమోదు చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను మంత్రి స్వయంగా మున్సిపల్ కార్పొరేషన్ అడిషనల్ కమిషనర్ నాగేశ్వరరావుకి అందచేశారు. వాటిని ధరనీ పోర్టల్ లో నమోదు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, నూతన రెవిన్యూ చట్టంలో భాగంగా భూ వివాదాలను శాశ్వతంగా పరిష్కరించే ప్రయత్నంలోనే ప్రజల ఆస్తుల నమోదుని కూడా సిఎం కెసిఆర్ చేపట్టారన్నారు. వ్యవసాయ భూముల తరహాలోనే, వ్యవసాయేతర భూములకు కూడా పట్టాపాసు పుస్తకాలు ఇవ్వాలని సిఎం తలపోస్తున్నారన్నారు. మెరూన్ కార్డు ఇద్దామని నిర్ణయించారన్నారు. ఈ పాసు పుస్తకం వల్ల, ప్రజల ఆస్తులకు భద్రత కలిగి, విలువలు పెరుగుతాయన్నారు. అంతేగాక, కుటుంబ వివరాలు, పూర్తిగా అందులోనే ఉంటాయన్నారు. కుటుంబాల మధ్య ఆస్తుల పంపిణీ సమయంలోనూ సమస్యలు రాకుండా ఉంటాయన్నారు.సమాజంలో ఆస్తుల సంబంధమైన సమస్యలు సమసిపోవడంతోపాటు, ప్రజలు సుఖ శాంతులతో జీవించాలన్నదే సీఎంగారు ఆలోచన అని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. తనకు సంబంధించిన ఆస్తులను ప్రస్తుతం నమోదు చేసుకున్న విధంగానే, ప్రజలంతా తమ తమ ఆస్తులను నమోదు చేసుకోవాలని, పంచాయతీ, కార్పొరేషన్ల సిబ్బందికి సహకరించాలని కోరారు. కొందరు చెప్పే మాయ మాటలు నమ్మొద్దని, ప్రభుత్వాన్ని, సీఎం కెసిఆర్ ని విశ్వసించాలని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు.