తెలంగాణ రాష్ట్రంలో 8 లక్షల 65 వేల 430 మంది లబ్దిదారులకు కొత్తగా 3లక్షల 93 వేల రేషన్ కార్డుల పంపిణి చేస్తున్నామని రాష్ట్ర పంచాయితీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వరంగల్ రురల్, వరంగల్ అర్బన్, జనగామ,జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ జిల్లాలో 12 వేల 305 రేషన్ కార్డులను కొత్తగా పంపిణి చేస్తున్నామని అయన తెలిపారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గంలోని ఐనవోలు, ఉప్పరపల్లి గ్రామాలలో నూతనంగా మంజూరు చేసిన రి రేషన్ కార్డులను మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, వర్ధన్నపేట ఎమ్మెల్యే ఆరూరి రమేష్, వరంగల్ జిల్లా డిసిసి బ్యాంక్ చైర్మన్ మర్నేని రవీందర్ రావు తో కలిసి మంగళవారం నాడు లబ్దిదారులకు పంపిణీ చేసారు.
రాష్ట్రంలో గత ఏడేళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో 1లక్ష 32 వేల మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. కొత్తగా మరో 56 వేల ఉద్యోగాల కల్పనకు త్వరలోనే నోటిఫికేషన్లు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో అర్హులైన లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు అందేలా ప్రభుత్వం చర్యలు గైకొంటున్నారని అయన తెలిపారు.త్వరలోనే రాష్ట్రంలో కొత్తగా పెన్షన్లు మంజూరు చేస్తామని మంత్రి తెలిపారు. అంతేకాకుండా పెన్షన్లు పొందడానికి కనీస వయస్సు 57 సంవత్సరాలకు తగ్గించనున్నట్లు ఆయన తెలిపారు.
రాష్ట్రంలో గ్రామాల సమగ్ర అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంత్రి అన్నారు. రాష్ట్రంలో పల్లె ప్రగతి నాలుగు విడతలలో విజయవంతంగా ముగిసిందని ఆయన తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించామని ఆయన అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమం వల్ల ప్రతి గ్రామంలో ట్రాక్టర్, ట్రాలీ, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, డంపింగ్ యార్డు, నర్సరీ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. దీనికి తోడుగా రైతుల సమగ్ర అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలలో రైతు వేదికలు, రైతు కల్లాలను ఏర్పాటు చేసిందని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోని సాంఘికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు.