రాజ్ కుంద్రాకు షాకిచ్చిన ముంబై కోర్టు..

85
Raj Kundra

వ్యాపారవేత్త, బాలీవుడ్ నటి శిల్పా శెట్టి భర్త రాజ్ కుంద్రాకు ముంబై కోర్టు షాకిచ్చింది. పోర్నోగ్రఫీ కేసులో ఈ నెల 19న రాజ్ కుంద్రాను ముంబై పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. యాప్స్ ద్వారా పోర్న్ వీడియోలను అప్ లోడ్ చేస్తున్నారనే అభియోగాలతో ఆయనపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అయితే మంగ‌ళ‌వారంతో ఆయ‌న క‌స్ట‌డీ ముగుస్తుంది. ఈ నేపథ్యంలో ఆయ‌న బెయిల్ కోసం అప్పీలు చేసుకున్నారు. దీనికి సంబంధించిన తాజా విచార‌ణ‌లో ముంబై హైకోర్టు రాజ్ కుంద్రాకు బెయిల్ నిరాకరించింది. పిటిష‌న్‌ను తిర‌స్క‌రిస్తూ 14 రోజుల పాటు జ్యుడీషియ‌ల్ క‌స్ట‌డీకి పంపారు.

ముంబై అంధేరిలో రాజ్ కుంద్రా వియాన్ ఇండ‌స్ట్రీస్‌లో కైం బ్రాంచ్‌ పోలీసులు సోదాలు జ‌రిపిన‌ప్పుడు సీక్రెట్ అల్మ‌రాలో ఆర్థిక లావాదేవీలు, క్రిప్టో క‌రెన్సీకి సంబంధించిన ప‌త్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసులో ఇంకా ఎవ‌రెవ‌రికీ లింకులున్నాయి అనే వివ‌రాల‌ను పోలీసులు రాబ‌ట్టే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అలాగే ఫోర్నోగ్ర‌ఫీలో భాగ‌మైన వారిని ప్ర‌శ్నించేందుకు పోలీసులు రెడీ అవుతున్నారు. అందులో భాగంగా ఇప్ప‌టికే షెర్లిన్ చోప్రాకు ముంబై పోలీసులు నోటీసులు జారీ చేయ‌డంతో బాలీవుడ్‌లో సంచలనంగా మారింది.

రాజ్ కుంద్రాను అరెస్ట్ చేసిన తర్వాత ఆయన నివాసంలో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా శిల్పా శెట్టి వాంగ్మూలాన్ని కూడా నమోదు చేశారు. అయితే తన భర్త అమాయకుడని శిల్పా శెట్టి పోలీసు అధికారులతో అన్నట్టు సమాచారం. తన భర్త ఎరోటిక్ కంటెంట్‌ను మాత్రమే అప్ లోడ్ చేశాడని, పోర్న్ కంటెంట్‌ కాదని శిల్పా పేర్కొంది.