తెలంగాణలో న్యాయవాదుల పిల్లలకు కూడా ఆరోగ్య బీమా పథకం వర్తిస్తుందన్నారు మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి. న్యాయవాదులకు ఆరోగ్య బీమా పథకంపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు న్యాయవాది,వారి జీవిత భాగస్వామికి మాత్రమే ఈ పథకాన్ని వర్తింపజేశామని…. ఇప్పుడు వారి ఇద్దరు పిల్లలకు కూడా దీన్ని వర్తింపజేయాలని తెలంగాణ స్టేట్ అడ్వొకేట్స్ వెల్ఫేర్ ట్రస్ట్ నిర్ణయం తీసుకుందని చెప్పారు. ఇన్సురెన్స్ ఏజెన్సీలతో సంప్రదింపులు జరిపి అతి తక్కువ ప్రీమియం కోట్ చేసే, మెరుగైన సేవలు అందించే కంపనీకి అప్పగించాలని అధికారులను ఆదేశించారు.
ఈ సందర్బంగా మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ… న్యాయవాది, వారి జీవిత భాగస్వామితో పాటు ఇద్దరు పిల్లలను కలుపుకుని మొత్తం 55,550 మంది హెల్త్ కార్డులను జారీ చేయనున్నట్లు తెలిపారు. 2019-2020 సంవత్సరానికి గాను త్వరలోనే హెల్త్ కార్డులను జారీ చేస్తామన్నారు. గత ఏడాది 18,404 మంది న్యాయవాదులకు హెల్త్ కార్డులను అందజేశామని… 945 మంది ఆరోగ్య బీమా పథకం ద్వారా లబ్దిపోందారని, మెడిక్లెయిమ్ కు మొత్తం రూ.5 కోట్లు వెచ్చించామని పేర్కొన్నారు. . ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, న్యాయ శాఖ కార్యదర్శి నిరంజన్ రావు, ట్రస్ట్ కార్యదర్శి, న్యాయశాఖ అదనపు కార్యదర్శి బాచిన రామాంజనేయులు, న్యాయ శాఖ ఉప కార్యదర్శి మన్నన్ ఫారూఖీ పాల్గొన్నారు.