హైదరాబాద్‌లో మైక్రాన్ భారీ పెట్టుబడి..

214
KTR
- Advertisement -

తెలంగాణలోకి మరో భారీ పెట్టుబడి రానున్నది. ప్రపంచంలోని ప్రముఖ సెమీ కండక్టర్ టెక్నాలజీ కంపెనీల్లో ఒకటైన మైక్రాన్ టెక్నాలజీ సంస్ధ హైదరాబాద్ నగరంలో భారీ ఎత్తున కార్యకలాపాలు చేపట్టనున్నారు. ఇప్పటికే సింగపూర్ తైవాన్, జపాన్, చైనా, మలేషియా దేశాల్లో పెద్ద ఎత్తున కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ భారతదేశంలో తన కార్యకలాపాలను విస్తరించేందుకు నిర్ణయం తీసుకుంది. భారతదేశ కార్యకలాపాను హైదరాబాద్ కేంద్రంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్న మైక్రాన్ సంస్థ ప్రతినిధులు ఈరోజు మంత్రి కేటీ రామారావుతో సమావేశం అయ్యారు. మైక్రాన్ సంస్థ సీనియర్ డైరెక్టర్ స్టీఫెన్ డ్రేక్, డైరెక్టర్ అమరేందర్ సిదూలతో కూడిన ప్రతినిధి బృందం ఈ రోజు బేగంపేట క్యాంపు కార్యాలయంలో మంత్రి కేటీ రామారావుతో సమావేశం అయింది.

మైక్రో సంస్థ తన కార్యకలాపాల విస్తరణకు హైదరాబాద్ నగరాన్ని ఎంచుకోవడం పట్ల మంత్రి కేటీ రామారావు ధన్యవాదాలు తెలిపారు. కంపెనీ విస్తరణలో భాగంగా హైదరాబాద్‌లో మైక్రాన్ సంస్థ మూడు వందల కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టబోతున్నదని, 1000 మంది ఇంజనీరింగ్ మరియు ఐటి వృత్తి నిపుణులకు సంస్థ ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించనున్పట్లు తెలిపారు. కంపెనీ విస్తరణ కోసం మాదాపూర్‌లో సుమారు ఒక లక్షా ఎనభై వేళ చదరపు అడుగుల కార్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఈ సందర్భంగా మంత్రికి కంపెనీ ప్రతినిధి బృందం తెలిపింది.

Minister KTR

కంపెనీకి అవసరమైన సిబ్బంది ఎంపిక మరియు శిక్షణకు తెలంగాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్- టాస్క్‌తో కలిసి పని చేస్తుందని ఈ సందర్భంగా మంత్రికి తెలిపింది. దీంతోపాటు ఇన్నోవేషన్ అవసరాల కోసం మైక్రాన్ సంస్థ టి వర్క్స్ మరియు టీ హబ్‌తో కలిసి పని చేస్తుందని తెలిపారు. మైక్రాన్ సంస్థ పెట్టుబడి ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఎలక్ట్రానిక్స్ మరియు సెమీ కండక్టర్ రంగంలో మరిన్ని పెట్టుబడులకు ఉతం ఇస్తుందని మంత్రి ఈ సందర్భంగా మంత్రి తెలిపారు.

మైక్రాన్, క్రుసియల్‌, బాలిస్టిక్ లాంటి అనేక గ్లోబల్ బ్రాండ్లను తమ కంపెనీ కలిగి ఉన్నదని, ముఖ్యంగా మెమొరీ ఆధారిత టెక్నాలజీలు తమ సొంతమని కంపెనీ ప్రతినిధి బృందం ఈ సందర్భంగా మంత్రి కేటీ రామారావుకు వివరించారు. రానున్న రోజుల్లో తమ కంపెనీ సాంకేతికతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు అటానమస్ వాహనాల రంగాల్లో విస్తృతంగా వినియోగించేందుకు అవకాశాలున్నాయని తెలిపింది.

తెలంగాణ ప్రభుత్వ పెట్టుబడి స్నేహపూర్వక విధానాలు, ఇక్కడి ప్రభుత్వం పారదర్శకంగా మరియు వేగంగా పని చేస్తున్న తీరు తమ కార్యకలాపాలను హైదరాబాద్ కేంద్రంగా ఎంచుకోవడానికి ప్రధాన కారణాలుగా కంపెనీ ఈ సందర్భంగా పేర్కొంది. తమ సంస్థ అవసరాల కోసం తెలంగాణ ప్రభుత్వ అధికార యంత్రాంగం స్పందించిన తీరు పైన మంత్రికి ధన్యవాదాలు తెలిపింది. ఈ సమావేశంలో ఐటి శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్ రంజన్ ఇతర ఐటి శాఖాధికారులు పాల్గోన్నారు.

- Advertisement -