సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి ఈమూవీకి దర్శకత్వం వహిస్తున్నారు. విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. రష్మీక మందన హీరోయిన్ గా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తోన్న ఈచిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఇక ఈమూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. జనవరి 5న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో ఈ వేడుకను చేపట్టనున్నారు.
ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిధిగా రానున్నారు. ఈవిషయాన్ని చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఇక మరోవైపు అల్లు అర్జున్ నటించిన అల..వైకుంఠపురంలో చిత్రం ఈనెల 12న విడుదల కానుంది. ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఈనెల 6న నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గెస్ట్ గా ఎవరు వస్తారన్నది సస్పెన్స్ గా ఉంచారు. ఫిలిం సర్కిల్ లో ఉన్న సమాచారం మేరకు అల..వైకుంఠపురంలో ప్రీ రీలిజ్ ఫంక్షన్ కు రామ్ చరణ్, ఎన్టీఆర్ లు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నట్లు తెలుస్తుంది. మహేశ్ బాబు కోసం మెగాస్టార్ చిరంజీవి వెళ్లడంతో సరిలేరు నీకెవ్వరు సినిమాకు మరింత హెల్ప్ కానుంది.