స్వచ్ఛతకు ప్రతి విద్యార్థి అంబాసిడర్‌గా మారాలి..

421
bonthu rammohan
- Advertisement -

విద్యార్థి దశ నుండే స్వచ్ఛతను పాటించడం, స్వచ్ఛ కార్యక్రమాలపై అవగాహన పొందేందుకు ఉద్దేశించిన స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని నగర మేయర్ బొంతు రామ్మోహన్, విద్యాశాఖ కార్యదర్శి డా.బి.జనార్థన్ రెడ్డిలు నేడు ప్రారంభించారు. కూకట్ పల్లి జె.ఎన్.టి.యు ఆడిటోరియంలో నేడు నిర్వహించిన కార్యక్రమంలో స్వచ్ఛ పాఠశాలతో పాటు క్లీన్ కమ్యునిటీస్ ఛాంపియన్ షిప్ కార్యక్రమాన్ని రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి, జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్లు హరిచందన, మమతలతో కలిసి ప్రారంభించారు.

పాఠశాలల్లో విద్యార్థులకు స్వచ్ఛ స్ఫూర్తిని కలిగించేలా క్లీన్ కమ్యునిటి చాంపియన్ షిప్, ఇంటర్ స్కూల్ రీసైక్లింగ్ ఛాంపియన్ షిప్ అవార్డులను ఈ కార్యక్రమంలో ప్రధానం చేశారు. 2,145 కిలోల డ్రై, రీసైక్లింగ్ చేసేందుకు వీలుగా ఉన్న వ్యర్థాలను సేకరించడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు కృషిచేసిన గచ్చిబౌలి ఓక్రిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ కు చెందిన రెండో తరగతి విద్యార్థి కందునూరి ఆదిత్ కు 2019 అంతర్ పాఠశాలల రీసైక్లింగ్ ఛాంపియన్ షిప్ అవార్డును మేయర్ రామ్మోహన్, విద్యాశాఖ కార్యదర్శి డా.బి.జనార్థన్ రెడ్డిలు అందజేశారు.

mayor

ఈ సందర్భంగా నగర మేయర్ బొంతు రామ్మోహన్ మాట్లాడుతూ.. విద్యార్థి దశ నుండే స్వచ్ఛ కార్యక్రమాలపై పూర్తిస్థాయి అవగాహన, స్ఫూర్తిని కలిగించడం వల్ల ఆరోగ్యవంతమైన సమాజం ఏర్పడుతుందని అన్నారు. ఈ దిశలో విద్యాశాఖ, జిహెచ్ఎంసితో కలిసి పనిచేయడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. స్వచ్ఛతకు ప్రతి విద్యార్థి స్వయంగా అంబాసిడర్, (రాయబారి)గా మారి తమ పాఠశాలతో పాటు ఇంట్లోనూ, పరిసరాలలో స్వచ్ఛ కార్యక్రమాలను నిర్వహించాలని పిలుపునిచ్చారు.

హైదరాబాద్ నగరంలో కోటి జనాభా ఉండగా కేవలం 18వేల మంది మాత్రమే నగర పరిశుభ్రతను చేపడుతున్నారని, వీరికితోడు నగరవాసులు స్వచ్ఛందంగా తమ నివాసాలు, పరిసరాలలో పరిశుభ్రతను పాటించాలని కోరారు. ప్రతి ఇంటిలో దోమల ఉత్పత్తికి కారణమయ్యే నీటి నిల్వలను తొలగించాలని అన్నారు. స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ద్వారా పాఠశాల ప్రాంగణాలను పరిశుభ్రంగా ఉంచడం, వ్యర్థాలను తడి, పొడి చెత్తగా వేరుచేయడం, సీజనల్ వ్యాధుల నివారణకు ముందస్తు చర్యలు చేపట్టడం, వ్యక్తిగత పరిశుభ్రత తదితర అంశాలు విద్యార్థులకు అలవడుతాయని మేయర్ రామ్మోహన్ పేర్కొన్నారు.

విద్యాశాఖ కార్యదర్శి డా.బి.జనార్థన్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 29వేల ప్రభుత్వ పాఠశాలలు, 10వేలకు పైగా ప్రైవేట్ పాఠశాలల్లో స్వచ్ఛ పాఠశాల కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 80లక్షల మంది విద్యార్థినీవిద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వీరందరిలో స్వచ్ఛత స్ఫూర్తిని కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రపంచంలో దాదాపు 50 దేశాల్లో పాఠశాల స్థాయి విద్యార్థులకు డయేరియా, వైరల్ జ్వరాలు, నిమోనియా ఇతర సీజనల్ వ్యాధులు రావని, దీనికి ప్రధాన కారణం వ్యక్తిగత పరిశుభ్రత పై పాఠశాల స్థాయి నుండే చైతన్యం కలిగించడమని అన్నారు. గాంధీ జయంతి రోజైన అక్టోబర్ 2వ తేదీన ప్రారంభించే ఈ స్వచ్ఛ పాఠశాల ద్వారా ప్రతి పాఠశాలకు 39 అంశాలను పంపించామని, వీటి ఆదారంగా ప్రతి పాఠశాల స్వియ మూల్యాంకనం ద్వారా స్వచ్ఛతపై రేటింగ్ పొందాల్సి ఉంటుందని వివరించారు.

వచ్చే సంవత్సరం అక్టోబర్ 2నాటికి ఈ 39 అంశాల ప్రాతిపదికపై స్వచ్ఛ పాఠశాలకు సంబంధించి 5స్టార్ రేటింగ్ జారీచేసి తగు ప్రోత్సాహకాలను అందించనున్నట్టు డా. జనార్థన్ రెడ్డి ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ప్రతి విద్యార్థిపై సంవత్సరానికి రూ.50 వేలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదివే విద్యార్థిపై లక్ష రూపాయలకు పైగా ప్రభుత్వం వెచ్చిస్తోందని, అయితే ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజు దాదాపు 20శాతంకు పైగా విద్యార్థులు గైర్హాజరవుతున్నారని వివరించారు. పాఠశాలల్లో హాజరు శాతాన్ని పెంచడం, స్వచ్ఛతపై విద్యార్థులను స్వచ్ఛదూతలుగా రూపొందించే ప్రధాన కార్యక్రమాన్ని చేపట్టామని విద్యాశాఖ కార్యదర్శి తెలిపారు.

రాష్ట్ర మున్సిపల్ శాఖ డైరెక్టర్ టి.కె.శ్రీదేవి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల్లో ఈ-ఆఫీస్ ను ప్రారంభించనున్నామని తెలిపారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ సంచాలకుల కార్యాలయంలో ఈ-ఆఫీస్ ద్వారా దాదాపు రెండున్నర లక్షల ఫైళ్లను నిర్వహిస్తున్నామని, తద్వారా రెండున్నర లక్షల ఫైళ్లకు సంబంధించిన పేపర్లను ఆధా చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న 14.50లక్షల మంది ఆస్తిపన్ను చెల్లింపుదారులకు కూడా ఆస్తిపన్ను డిమాండ్ నోటీసులను ఎలక్ట్రానిక్ విధానం ద్వారానే పంపాలని నిర్ణయించినట్టు తెలిపారు.

శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ హరిచందన మాట్లాడుతూ.. స్వచ్ఛ భారత్ స్ఫూర్తిని కలిగించేవిధంగా పాఠశాలల్లో రీసైక్లింగ్, వ్యర్థాల నిర్వహణ పై చైతన్య కలిగించేలా స్వచ్ఛ పాఠశాల కార్యక్రమంతో సత్ఫలితాలు లభిస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి జోనల్ కమిషనర్ వి.మమత, జె.ఎన్.టి.యు రిజిస్టార్ యాదయ్య, జిహెచ్ఎంసి డిప్యూటి కమిషనర్లు రవికుమార్, ప్రదీప్ కుమార్, వావ్ ఐ.టి.సి కి చెందిన సంజయ్ సింగ్, ఉమకాంత్, మురళి, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -