మే 13…సీఎం కేసీఆర్ అభినందన సభ..

25
- Advertisement -

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. తాజాగా హైదరాబాద్ నగరం నడిబొడ్డున 125అడుగుల అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకున్న సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞత పూర్వకంగా మే13వ తేదీన దళిత గిరిజన సంఘాల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ మినిస్టర్ క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన దళిత గిరిజన సంఘాల ప్రతినిధుల సభలో రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…అంబేద్కర్ ఆశయాలను సీఎం కేసీఆర్ రాష్ట్రంలో అమలుచేసి చూపించడంతో పాటు…ఆయన కలలను సాకారం చేస్తున్నారని అన్నారు. ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కు తెలంగాణ ప్రభుత్వం ఆత్మగౌరవం దక్కించిందన్నారు. ఆర్టికల్‌-3 ఆధారంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, అందుకు కృతజ్ఞతగా సీఎం కేసీఆర్‌ దేశంలోనే అత్యంత ఎత్తైన అంబేద్కర్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారని ఆయన అన్నారు.

సీఎం కేసీఆర్ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయానికి కృతజ్ఞతగా ఈనెల 13న పెద్ద ఎత్తున అభినందన సభ నిర్వహించనున్నట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. సభ ఎక్కడ నిర్వహించాలన్నది త్వరలోనే ప్రకటిస్తామన్నారు. రాష్ర్టం నలుమూలల నుంచి అన్ని వర్గాల ప్రజలు తరలి వచ్చి ప్రభుత్వానికి.. సీఎం కేసిఆర్ కు బాసటగా నిలువాలని కోరారు. గతంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇవ్వని విధంగా దళితుల అభ్యున్నతికి తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అన్నారు. దళితోద్ధరణకు సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పథకాలు తీసుకొచ్చి అట్టడుగు వర్గాలకు అందజేస్తున్నారని అన్నారు. దళితుల పట్ల సమాజ దృక్పథం మారేలా, గుణాత్మక మార్పునకు సీఎం కేసీఆర్‌ కృషిచేస్తున్నారని కొనియాడారు.

తరతరాలుగా కులవివక్షకు గురైన దళితుల జీవితాల్లో దళితబంధ్‌ పథకం ప్రవేశపెట్టి వెలుగులు నింపడమే కాకుండా… బాబా సాహెబ్‌ బాటలో నడుస్తూ బడుగు బలహీనవర్గాల బంగారు భవిష్యత్తుకు బాటలు పరిచారని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రాజకీయాలకు అతీతంగా దళితబంధు పథకానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దేశంలో ఎన్నో కొత్త రాష్ట్రాలు ఏర్పడినా ఈ తరహా ప్రయత్నం జరగలేదన్నారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి సీఎం కేసీఆర్‌ అని అన్నారు. స్వరాష్ట్రంలో, సీఎం కేసీఆర్‌ సారథ్యంలో రాష్టం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు.

Also Read: పవన్ ను భయపెడుతున్న సెంటిమెంట్ ?

దళిత వర్గాల్లో ఆర్థికవికాసానికి ‘దళిత బంధు’ పథకాన్ని ప్రవేశ పెట్టి 10 లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థుల కోసం గురుకులాలు ఏర్పాటు చేయడం, ఎస్సీ సబ్‌ ప్లాన్‌ను ఏర్పాటు చేయడంతోపాటు విదేశాల్లో చదివేందుకు 20 లక్షల సాయం అందించి ప్రోత్సహిస్తున్నారన్నారు. రాష్ర్ట బడ్జెట్ లో సింహభాగం దళితుల అభ్యున్నతికి కేటాయించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. సీఎం కేసీఆర్‌కు వెన్నంటి ఉండి ఆశీర్వదించాలని ఆయన పిలుపునిచ్చారు.

Also Read: ఏపీ మంత్రులు.. చేతనైతే పోరాడండి !

దళిత వర్గాలను ఇబ్బందులు పెట్టే విధంగా విమర్శలు చేస్తున్న వారిని ఏకతాటిపైకి వచ్చి అడ్డుకోవాలని సూచించారు. గత ప్రభుత్వాలన్ని ఎస్సీ వర్గాల పేరుతో నిధులు కేటాయించినప్పటికీ ఆయా వర్గాలకు ప్రయోజనం చేకూర్చ లేకపోయాని విమర్శించారు. అంబేద్కర్ స్ఫూర్తితోనే..ముందుకు సాగుదామని మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో రాజీవ్ సాగర్ సహా పలువురు దళిత గిరిజన ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

- Advertisement -