రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టిన రోజు ఫిబ్రవరి 17వ తేదీన పాలకుర్తి నియోజకవర్గంలో విస్తృతంగా మొక్కలు నాటి ఆయనకు కానుకగా వాటిని సంరక్షించాలని రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పార్టీ శ్రేణులు, ప్రజలకు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా (పాలకుర్తి నియోజకవర్గం) తొర్రూరులోని పార్టీ ఆఫీసులో తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి మండలాల ముఖ్య నాయకులతో, పాలకుర్తి క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి, దేవరుప్పుల, కొడకండ్ల మండలాల ముఖ్య నాయకులతో వేర్వేరుగా మంత్రి బుధవారం సమావేశమయ్యారు. సమకాలీన పాలన, రాజకీయాలపై ముఖ్య నేతలకు అవగాహన కల్పించి చైతన్య పరిచారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ తెచ్చిన మహానుభావుడు, తెలంగాణను బంగారు మయం చేయడానికి కంకణం కట్టకుని పని చేస్తున్న సీఎం, రైతు, దీన జన బాంధవుడు కెసిఆర్, ఎంతో శ్రద్ధతో హరిత హారం వంటి కార్యక్రమాలు చేపట్టారన్నారు. అలాంటి సీఎం పుట్టిన రోజున ఆయనకు కానుకగా, పాలకుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా విస్తృతంగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని మంత్రి ముఖ్య నేతలకు విజ్ఞప్తి చేశారు. రికార్డు సృష్టించేలా మొక్కలు నాటాలని, ఇందుకు పార్టీ శ్రేణులతోపాటు, ప్రజలను సమాయత్తం చేయాలని మంత్రి పిలుపునిచ్చారు.
పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం కూడా త్వరలోనే ప్రారంభమవుతుందని, ఇందుకునుగుణంగా పాలకుర్తి నియోకవర్గంలో పార్టీ సభ్యత్వాన్ని సాధ్యమైనంత ఎక్కువగా చేసి, రాష్ట్రానికే ఆదర్శంగా నెంబర్ వన్ గా నిలపాలని చెప్పారు. పార్టీని బలంగా ఉంచడమే గాక, వెన్నెముక లాగా ఉండే పార్టీ శ్రేణులను మరింతగా పెంచుకోవాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్రంలో పార్టీ సభ్యత్వంలో టిఆర్ఎస్ నెంబర్ వన్ గా ఉందన్నారు. అయితే, ఇందులో కూడా పాలకుర్తి నియోజకవర్గాన్ని నెంబర్ వన్ గా నిలపాలని మంత్రి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలను కోరారు.
ఇప్పటికే వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించిన సమాయత్త సమావేశాలు, ఓటర్ల నమోదు వంటి కార్యక్రమాలను పూర్తి చేశామని చెప్పారు. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోగా, పార్టీ శ్రేణులు, ముఖ్య నాయకులు ఇప్పటికే సిద్ధంగా ఉన్న మన ఇన్ చార్జీలను అప్రమత్తం చేయాలన్నారు. ఏ సమయంలోఎన్నికలు వచ్చినా అందకు సిద్ధంగా ఉండాలని చెప్పారు. ఈ సమావేశాలలో పాలకుర్తి నియోజకవర్గంలోని తొర్రూరు, పెద్ద వంగర, రాయపర్తి, పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల 6 మండలాకు చెందిన పార్టీ అధ్యక్షులు, కార్యవర్గం, ఇతర నేతలు, మండలాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.