దేశంలో కరోనా సెకండ్ వేవ్ రోజురోజుకు తీవ్రరూపం దాల్చుతోంది. రోజుకు రికార్డు స్ధాయిలో లక్ష పాజిటివ్ కేసులు నమోదవుతుండగా దేశ రాజధాని ఢిల్లీలో రాత్రిపూట కర్ఫ్యూ విధించారు. ఇక కరోనా సెకండ్ వేవ్‌ను అరికట్టేందుకు మాస్క్‌తో పాటు శానిటైజర్ తప్పనిసరి చేయగా తాజాగా ఢిల్లీ హైకోర్టు కఠిన ఆదేశాలు జారీ చేసింది.
కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లినా ఆ వ్యక్తి కచ్చితంగా మాస్క్‌ను ధరించాలని ఆదేశాల్లో పేర్కొన్నది. మాస్క్ అనేది సురక్షా కవచంగా పనిచేస్తుందని, అది కోవిడ్ వ్యాప్తిని అడ్డుకుంటుందని కోర్టు అభిప్రాయపడింది. ఒంటరిగా ప్రైవేటు కారుల్లో వెళ్తున్న వారిపై జరిమానా విధించడాన్ని రద్దు చేయాలని దాఖలైన నాలుగు పిటిషన్లను కోర్టు కొట్టిపారేసింది.
దేశంలో గత 24 గంటల్లో లక్షా 15 వేల పాజిటివ్ కేసులు రికార్డు కాగా 600కి పైగా మృతిచెందారు. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నా.. మరోవైపు మాత్రం పాజిటివ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి.