మలయాళం సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తాజా చిత్రంగా ‘మరక్కార్’. ఈ మూవీ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. 100 కోట్ల బడ్జెట్‌తో.. భారీ తారాగణంతో ఈ సినిమా నిర్మితమైంది. ప్రియదర్శన్ ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. మోహన్‌లాల్‌కి తెలుగులో మంచి గుర్తింపు, మార్కెట్ ఉండటంతో ఈ చిత్రం తెలుగులోనూ అనువాదమైంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సురేష్ ప్రొడక్షన్స్ ఈ సినిమాని విడుదల చేసింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ మూవీ ఏమేరకు ప్రేక్షకులను ఆకట్టుకుందో చూద్దాం..
కథ:
16వ శతాబ్దానికి చెందిన ఒక కేరళ పోరాట యోధుడి కథ ఇది. కుంజాలి మరక్కార్ అనే ఒక యోధుడి జీవితంలోని ఒక కోణం ఇది. కేరళ తీర ప్రాంతాన్ని తమ స్వాధీనంలోకి తీసుకురావడానికి ప్రయత్నించిన పోర్చుగీసువారిని మరక్కార్ ధైర్యసాహసాలతో ఎదురిస్తాడు. ఫలితంగా తన కుటుంబ సభ్యులను కోల్పోతాడు. పోర్చుగీసువారి బారి నుంచి తప్పించుకున్న మరక్కార్ రహస్య జీవితంలోకి వెళ్లిపోతాడు. తిరిగి ఆయన తన బలాన్ని ఎలా కూడగట్టుకున్నాడు? పోర్చుగీసువారిపై ఎలా ప్రతీకారం తీర్చుకున్నాడు? అనేదే కథ.
ప్లస్ పాయింట్స్:
కథా నేపథ్యం, పోరాట ఘట్టాలు ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ అని చెప్పాలి. మోహన్‌లాల్ పోషించిన కుంజాలి పాత్రే సినిమాకి కీలకం. పోరాట ఘట్టాల్లో తన శక్తి మేరకు నటించి మెప్పించారు.
మైనస్ పాయింట్స్:
సినిమా మొదలై సగమైనా కొత్త పాత్రలు పుట్టుకొస్తూనే ఉంటాయి తప్ప, పరిచయమైన పాత్రలు ప్రభావమే చూపించవు. సీనియర్ దర్శకుడు ప్రియదర్శన్ ఆయన బృందం కథనం విషయంలో చేసిన కసరత్తలు సరిపోలేదు. కథ పరంగా ఏ దశలోనూ రక్తికట్టించలేదు దర్శకుడు. భావోద్వేగాలు పండక పండించలేకపోయారు. పోరాట ఘట్టాలు మినహా సినిమాలో చెప్పుకోదగిన అంశాలేమీ లేవు.
సాంకేతిక విభాగం:
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. విజువల్ ఎఫెక్ట్స్ పాటు, సాబు సిరిల్ కళా ప్రతిభ అడుగడుగునా కనిపిస్తుంది. సంగీతం బాగుంది, తిరు కెమెరా పనితనం సినిమాకి మరింత వన్నె తెచ్చాయి. రచన పక్కాగా లేకపోతే ఏ విభాగం ఎంత ప్రతిభ చూపించినా ప్రయోజనం ఉండదని ఈ సినిమా నిరూపిస్తుంది. నిర్మాణం బాగుంది. ప్రియదర్శన్ కథనం పరంగా దృష్టిపెట్టుంటే ఈ సినిమా మరోస్థాయిలో ఉండేది.
తీర్పు:
కుంజాలి మరక్కార్ పోరాటం సముద్రంలో పోసిన పన్నీరులా వృదా అయిపోయింది.
విడుదల తేదీ: 03/12/2021
రేటింగ్:2.5/5
నటీనటులు: మోహన్‌లాల్, కల్యాణి ప్రియదర్శన్, కీర్తిసురేష్
సంగీతం: రోనీ రాఫెల్;
నిర్మాణం: ఆంటోనీ పెరంబవూర్
దర్శకత్వం: ప్రియదర్శన్, అని శశి