జనతా గ్యారేజ్ హిట్‌తో మంచి ఊపు మీదున్న మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా మన్యం పులి. మలయాళంలో బిగ్గెస్ట్ హిట్ సాధించి రూ.125 కోట్ల కలెక్షన్లు సాధించిన పులిమురుగన్ రికార్డులను తిరగరాసింది. తెలుగులో మన్యంపులిగా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన మోహన్ లాల్ ఎలాంటి సక్సెస్‌ను సాధించాడు..?మన్యంపులితో హిట్ కొట్టాడా లేదా చూద్దాం…
కథ:
కుమార్(మోహన్ లాల్) చిన్నప్పటి రోజులతో సినిమా ప్రారంభమవుతుంది. తల్లి చిన్నప్పుడే చనిపోవడంతో బంధువుల దగ్గర పెరుగుతాడు కుమార్. పులియూర్ మన్యం ప్రాంతం. అక్కడ పులులు సంచరిస్తుంటాయి. ఓ పులి భారిన పడి వాటి కారణంగా కుమార్ (మోహన్‌లాల్) తండ్రిని కోల్పోతాడు. తన తండ్రిని చంపిన పులిని మట్టుబెడతాడు. దీంతో పులియూర్ ప్రజలకు రక్షకుడిగా మారిపోతాడు. ఈ క్రమంలో అనాథైన మైనా (కమలిని ముఖర్జీ)ని పెళ్లాడుతాడు. వాళ్లకి చిన్ని అనే పాప కూడా ఉంటుంది. అనుకోకుండా పాత విరోధం ఉన్న ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (కిశోర్)తో కుమార్‌కి గొడవలు జరుగుతాయి. తర్వాత ఏం జరిగింది…కుమార్ ఈ గొడవ నుంచి ఎలా బయటపట్టాడు…చివరికి కథ ఎలా సుఖాంతమైందో తెరమీద చూడాల్సిందే.
ప్లస్ పాయింట్:
సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ కథ, మోహన్ లాల్ నటన, స్క్రీన్ ప్లే. ముఖ్యంగా మోహన్ లాల్ నటన ఈ సినిమాకు హైలెటైంది. పులితో చేసే పది నిమిషాల పోరాట సన్నివేశాలు చాలా బాగున్నాయి. అతి తక్కువ మేకప్‌తో అడవుల్లో పెరిగిన అమ్మాయిలాగా చక్కగా నటించింది కమలిని. ఎస్టేట్ ఓనర్ కూతురిగా, స్థానిక యువకుడిపై కన్నేసిన పాత్రలో గ్లామరస్‌గా కనిపించే ప్రయత్నం చేసింది నమిత. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గా కిశోర్ నటన, డాడీ గిరిజ పాత్రలో జగపతిబాబు చాలా బాగా మెప్పించారు.
మైనస్ పాయింట్:
సినిమాకు మెజర్ మైనస్ పాయింట్ సెకండాఫ్, కామెడీ లేకపోవడం. కథనం పెద్దగా ఆకట్టుకోలేదు. రన్ టైం ఎక్కువగా ఉందన్న ఫీలింగ్ వస్తుంది. నమిత పాత్రను చూసి కమలిని ముఖర్జీ ఉడుక్కునే సన్నివేశాలు పెద్దగా మెప్పించవు. ఆడవాళ్లు స్నానం చేస్తుంటే చూసే వీక్‌నెస్ ఉన్న కమెడియన్ పాత్ర ఎబ్బెట్టుగా ఉంటుంది. హీరో తమ్ముడి పాత్రను ఇంకాస్త మెరుగ్గా మలచి ఉంటే బావుండేదేమో.
సాంకేతిక విభాగం:
ఉదయ్ కృష్ణ అందించిన కథను దర్శకుడు వైశాఖ్ అద్భుతంగా తెరకెక్కించాడు. తెరమీద పులి కనిపించగానే వచ్చే సన్నివేశాలు చాలా బావుంటాయి.గోపీసుందర్ సంగీతంలో పాటలు బావున్నాయి. నేపథ్య సంగీతం కూడా చాలా బావుంది. పీటర్ హెయిన్స్ కంపోజ్ చేసిన ఫైట్లు సినిమాకు ప్రత్యేక ఆకర్షణ. షాజీ కుమార్ చాయాగ్రహణం బాగుంది. మహేష్ నారాయణ్ ఎడిటింగ్, నిర్మాణ విలువలు బాగున్నాయి.
తీర్పు:
ఈ తరహా సినిమా తెలుగు తెరపై కనిపించి చాన్నాళ్లయింది. రిమేక్ సినిమా అయినా అలాంటి ఫిలింగ్ రాకుండా అద్భుతంగా మన్యంపులిని తెరకెక్కించారు. మోహన్ లాల్ నటన…పులితో చేసే పోరాట సన్నివేశాలు,కమలిని ముఖర్జీ నటన సినిమాకు ప్లస్ పాయింట్ కాగా….ఆకట్టుకోని కథనం,కామెడీ లేకపోవడం మైనస్ పాయింట్. మొత్తంగా `మనమంతా`, `జనతాగ్యారేజ్` తో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మోహన్ లాల్..మన్యం పులితో మరోసారి ఆకట్టుకున్నాడు.
విడుదల తేదీ:02/12/2016
రేటింగ్:3 /5
నటీనటులు:మోహన్‌లాల్, కమలినీ ముఖర్జీ
సంగీతం: గోపీసుందర్
నిర్మాతః సింధూరపువ్వు కృష్ణారెడ్డి
దర్శకత్వం: వైశాక్