మోదీపై నిప్పులు చెరిగిన దీదీ..

112
mamatha

పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు మరి కొద్ది రోజులే ఉండడంతో రాజకీయం మరింతగా వేడెక్కింది. అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీ నేతల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. బెంగాల్‌లో కాషాయ జెండా ఎగరవేయాలన్న తపనతో మోదీ, అమిత్‌షాలు, స్థానిక బీజేపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అంతే కాదు బెంగాల్ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ అడ్డదారులు తొక్కుతుంది. ఉత్తర ప్రదేశ్ నుంచి కాషాయ కార్యకర్తలను బెంగాల్‌లో దించుతున్నారని, ఓటర్లకు పంచడానికి యూపీ నుంచి వేల కోట్ల రూపాయలు తరలిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ ప్రధాని మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

ఇటీవల బంకురా జిల్లాలోని బిషాన్‌పూర్ పట్టణంలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా దీదీ మాట్లాడుతూ.. తాను ప్రధాన మంత్రి పదవికి గౌరవం ఇస్తానంటూనే మోదీపై నిప్పులు చెరిగారు. నేను ప్రధానమంత్రి పదవికి, ఆ కుర్చీకి అత్యంత గౌరవం ఇస్తాను. కానీ నా జీవితంలో మోదీ లాంటి అబద్దాల కోరు అయిన ప్రధానమంత్రిని చూడలేదు అంటూ దీదీ మండిపడ్డారు. మోదీ చెప్పేవన్నీ అబద్దాలే అంటూ ఎద్దేవా చేశారు. పశ్చిమ బెంగాల్ సంస్కృతిని నాశనం చేయడానికి ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తరలిస్తున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. బీజేపీ పెడుతున్న టార్చర్ ను భరించలేక ఉత్తర ప్రదేశ్ లోని ఐపీఎస్ ఆఫీసర్లు ఉద్యోగాలను వదులుకుంటున్నారని వ్యాఖ్యానించారు.

ఢిల్లీలో ధర్నాలు చేస్తున్న రైతుల గురించి ఏమాత్రం పట్టించుకోని మోదీ సర్కారు పశ్చిమ బెంగాల్ కు ఏదో చేస్తామంటూ హామీలు ఇస్తున్నారు. వాటిని నమ్మే పరిస్థితిలో ఇక్కడి ప్రజలు లేరు అంటూ బీజేపీకి చురకలు అంటించారు. ఈ సందర్భంగా బెంగాల్ ప్రజలకు మమతా బెనర్జీ సరికొత్త వరం ప్రకటించారు.. బెంగాల్‌లో ఎన్నికల ఫలితాలను తారుమారు చేసేందుకు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం నుంచి గూండాలను తీసుకొస్తున్నారని. డబ్బులు పంచి ఓట్లను కొనాలని బీజేపీ ప్రయత్నిస్తోందన్న సమాచారం నాకు ఉంది. పశ్చిమ బెంగాల్ ప్రజలారా? వాళ్ల ట్రాప్ లో పడొద్దు. డబ్బులు పంచే బీజేపీ నేతలను నిలదీయండి. వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోండి. డబ్బులు పంచే బీజేపీ లీడర్లను పట్టుకున్న బెంగాల్ పౌరులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తా….రాబోయే ఎన్నికల్లో గెలవగానే వారికి ఈ హామీని నెరవేరుస్తా‘ అంటూ మమతా బెనర్జీ బెంగాల్ ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. మొత్తంగా బెంగాల్‌లో యుపీ గూండాలను దించి, బెంగాల్‌లో ఓటుకు నోట్లు పంచేందుకు బీజేపీ కుట్రలు చేస్తుందంటూ మమతాబెనర్జీ చేసిన వ్యాఖ్యలు బెంగాల్ రాజకీయవర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారాయి.