ఇటీవల జరిగిన పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) చేతిలో ఓడిపోయినప్పటి నుండి తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తీవ్ర అంతర్గత సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో తాజాగా పార్టీ వ్యవస్థాపకురాలు మమతా బెనర్జీ చేతుల్లోంచి పార్టీ నియంత్రణ చేజారుతున్నట్లు కనిపిస్తోంది. తిరుగుబాటు వర్గం సోమవారం ఆమెను అధ్యక్షురాలి పదవి నుండి తొలగించి, సీనియర్ ఎమ్మెల్యే అరూప్ రాయ్‌ను ఆ పదవికి ఎన్నుకోవడం మమతకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది.
మరోవైపు సమాంతర నాయకత్వ నిర్మాణాన్ని తిప్పికొట్టేందుకు మమతా బెనర్జీ బృందం రంగంలోకి దిగింది. పార్టీ ఆఫీస్ బేరర్లు (పదవుల్లో ఉన్నవారు), జాతీయ కార్యవర్గ సభ్యుల తాజా జాబితాను ఎన్నికల సంఘానికి (ఈసీ) పంపింది. మమతా బెనర్జీయే ఇప్పటికీ పార్టీకి నాయకత్వం వహిస్తున్నారని ఇందులో స్పష్టం చేసింది.
పార్టీని ఐక్యంగా ఉంచడానికి తనను తాను అధినేత్రిగా నిలబెట్టుకోవడానికి మమతా బెనర్జీ ఈ నెల ప్రారంభం నుండి పోరాడుతున్నారు. జూన్ 3న అసెంబ్లీ స్పీకర్ రతీంద్ర నాథ్ బోస్ ఏకంగా 58 మంది తిరుగుబాటు టీఎంసీ ఎమ్మెల్యేలను సభలో ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించారు. జూన్ 1న మమత నేతృత్వంలోని టీఎంసీ నుండి బహిష్కరణకు గురైన రితబ్రత బెనర్జీ, సందీపన్ సాహాలు వరుసగా ప్రతిపక్ష నేత, ఉపనేతలుగా మారారు. పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ సాధించిన 80 స్థానాలకు గాను బీజేపీ 207 స్థానాలను కైవసం చేసుకున్న 29 రోజుల తర్వాత ఈ పరిణామం చోటుచేసుకుంది.
కొద్దిరోజుల తర్వాత టీఎంసీ నుండి మరో 20 మంది ఎంపీల తిరుగుబాటు వర్గం తెరపైకి రావడంతో మమతా బెనర్జీ కష్టాలు మరింత రెట్టింపయ్యాయి. ఆమె పక్కన మహువా మోయిత్రా, కళ్యాణ్ బెనర్జీ, డెరెక్ ఒబ్రెయిన్ వంటి కొద్దిమంది ప్రజాప్రతినిధులు మాత్రమే మిగిలారు. పార్టీ నియంత్రణపై ఇరువర్గాల మధ్య పోటీ నెలకొన్న తరుణంలో, మమతా బెనర్జీ బృందం మంగళవారం ఎన్నికల సంఘానికి (ఈసీ) ఒక జాబితాను సమర్పించింది.
Also Read:వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్
ఆ జాబితా ప్రకారం ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా మమతా బెనర్జీ, ఉపాధ్యక్షుడిగా సుబ్రతా బక్షీ, జాతీయ ప్రధాన కార్యదర్శిగా (లోక్‌సభ పక్ష నేత) అభిషేక్ బెనర్జీ ఉన్నారు. ఆఫీస్ బేరర్ల జాబితాలో డెరెక్ ఒబ్రెయిన్ (రాజ్యసభ ఎంపీ), డోలా సేన్ సంయుక్త కార్యదర్శులుగా, సుభాశిష్ చక్రవర్తి కోశాధికారిగా ఉన్నారు.జాతీయ కార్యవర్గంలో మమతా బెనర్జీ, సుబ్రతా బక్షీ, అభిషేక్ బెనర్జీ, డెరెక్ ఒబ్రెయిన్, డోలా సేన్, సుభాశిష్ చక్రవర్తి ఉన్నారు.

