భారతీయ స్టార్టప్ రంగంలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ ‘క్రెడ్’ (CRED) వ్యవస్థాపకుడు కునాల్ షా సోషల్ మీడియా దిగ్గజం వాట్సాప్ గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు. ఈ నియామకంతో పాటు క్రెడ్ సంస్థలో మెటా దాదాపు $900 మిలియన్లు (సుమారు ₹8,550 కోట్లు) పెట్టుబడి పెట్టనున్నట్లు ప్రకటించింది.
అంతర్జాతీయ టెక్నాలజీ దిగ్గజం భారతీయ ఫిన్‌టెక్ స్టార్టప్‌లో చేసిన అతిపెద్ద పెట్టుబడులలో ఇది ఒకటి. ఈ భారీ ఒప్పందంలో భాగంగా కునాల్ షా క్రెడ్ సీఈఓ బాధ్యతల నుండి తప్పుకుని మెటా గ్లోబల్ లీడర్‌షిప్ టీమ్‌లో చేరనున్నారు. ప్రస్తుతం వాట్సాప్ హెడ్‌గా ఉన్న విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో ఆయన బాధ్యతలు స్వీకరిస్తారు. క్యాత్‌కార్ట్ మెటాలోనే ఉంటూ ఇతర నెక్స్ట్-జనరేషన్ ఉత్పత్తుల విభాగంలో పని చేస్తారు.
కునాల్ షా క్రెడ్ రోజువారీ కార్యకలాపాల నుండి తప్పుకున్నప్పటికీ అందులో ఆయన వ్యక్తిగత వాటాలను అలాగే కొనసాగిస్తారు. 2020 నుండి క్రెడ్ వ్యూహాత్మక, ఆర్థిక విభాగాల అధిపతిగా ఉన్న మిటెన్ సంపత్ తక్షణమే తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. ఈ కొత్త పెట్టుబడితో క్రెడ్ విలువ (పోస్ట్-మనీ వాల్యుయేషన్) $4.5 బిలియన్లకు (సుమారు ₹43,239 కోట్లు) చేరుకుంది. ఈ డీల్ ద్వారా మెటాకు క్రెడ్‌లో దాదాపు 20 శాతం వాటా దక్కుతుంది. అయితే దీనివల్ల క్రెడ్ వినియోగదారుల డేటా ఏదీ మెటాకు అందుబాటులోకి రాదని కునాల్ షా స్పష్టం చేశారు.
Also Read:TTD:26 నుంచి జ్యేష్టాభిషేకం
మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ఈ నియామకంపై స్పందిస్తూ కునాల్…. క్రెడ్‌ను భారతదేశంలోని అత్యంత ముఖ్యమైన సాంకేతిక సంస్థలలో ఒకటిగా తీర్చిదిద్దారు. ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్‌ను నడపడానికి అవసరమైన గ్లోబల్ దృక్పథం, సరికొత్త ఆలోచనలు ఆయనకు ఉన్నాయి అని కొనియాడారు.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 3 బిలియన్లకు పైగా కేవలం భారతదేశంలోనే 500 మిలియన్ల కంటే ఎక్కువ మంది వినియోగదారులు వాట్సాప్‌ను వాడుతున్నారు. వాట్సాప్‌ను కేవలం మెసేజింగ్ యాప్‌గానే కాకుండా కామర్స్, డిజిటల్ పేమెంట్స్ (WhatsApp Pay) మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సేవల వేదికగా మార్చడంలో కునాల్ షా అనుభవం మెటాకు ఎంతగానో ఉపయోగపడనుంది.

