మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై మంత్రి కేటీఆర్ ఆదేశాలు..

119
ktr
ktr
- Advertisement -

వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జరిగే మహాశివరాత్రి జాతర ఏర్పాట్లపై జిల్లా అధికారులతో మంత్రి కేటీఆర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఆలయ, పోలీస్, రెవెన్యూశాఖల సమన్వయంతో జాతరను విజయవంతం చేయాలని.నాలుగు నుండి ఐదు లక్షల మంది భక్తులు వచ్చే అవకాశం ఉంటుందిని తెలిపారు. సామాన్య భక్తులకు దర్శనం కల్పించడంలో తగిన ప్రాధాన్యత ఇవ్వాలి. జాతరకు వచ్చే విఐపి భక్తులకు ఒకే సమయం కేటాయించి అదే సమయంలో దర్శనం కల్పించాలి. దీనిపై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి ఆదేశించారు.

ఆలయ వసతి గదులను భక్తులకు కేటాయించాలని.. జాతరకు భద్రత నిమిత్తం విధులకు వచ్చేవారికి ఇతర చోట్ల వసతి సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్‌కు మంత్రి సూచించారు.జాతరలో కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా అమలయ్యేలా చూడాలని ఆదేశించారు. ఇందు కోసం 3 లక్షల మాస్క్‌లు ఉచితంగా అందజేసేందుకు ఏర్పాట్లు చేయాలి. 25 చోట్ల ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. వంద పడకల ఆస్పత్రిని మార్చి మొదటి వారంలోనే ప్రారంభించే విధంగా పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. అన్ని శాఖల సమన్వయంతో వాట్సాప్ గ్రూపు ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పనులను షేర్ చేసుకోవాలని సూచన చేశారు.

అలాగే దేవాలయ పరిసరాల్లో పరిశుభ్రతకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలి.. పరిసరాల పరిశుభ్రతను మున్సిపల్ అధికారులు కూడా పర్యవేక్షించాలి.. సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్‌తో సమన్వయమై వారం రోజుల ముందే పట్టణం పరిశుభ్రంగా ఉండాలని మంత్రి ఆదేశించారు. రహదారులు కూడా ఎక్కడా గుంతలు లేకుండా చూసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి కాలం కావడంతో మిషన్ భగీరథ తాగునీరు.. విజయ డైరీతో మాట్లాడి మజ్జిగ ప్యాకెట్లు కూడా సమకూర్చుకోవాలని సూచించారు.జాతరకు సంబంధించిన ఏదైనా ప్రమాదం జరిగితే తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ముందస్తుగా పోలీస్, ఫైర్ రెవిన్యూ, వైద్య ,ఆలయ అధికారులు మాక్ డ్రిల్ చేసుకొని ముందస్తుగా అప్రమత్తం కావాలని ఆదేశించారు.

రాజమండ్రి లాంటి సంఘటనలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.సాంస్కృతిక వేడుకలు కూడా యధావిధిగా నిర్వహిస్తామని ఇందుకు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి సూచించారు.ఇరవై రోజుల తర్వాత నిర్వహించే సమీక్ష సమావేశానికి సంబంధిత అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమైరావాలని మరోసారి మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఆలయానికి వచ్చే భక్తులకు కనీస కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ఆలయంలో చర్యలు లేవని అధికారులపై మంత్రి కేటీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

- Advertisement -