మైన్‌పురి సమరంలో ఇద్దరు కోడళ్లు!

353
sp
- Advertisement -

సమాజ్ వాది పార్టీలో కుటుంబ కలహాలు కొత్తేమీ కాదు. నేతాజీ దివంగత ములాయం సింగ్ యాదవ్ బ్రతికున్న రోజుల్లోనే కుటుంబ కలహాలతో వార్తల్లో నిలిచేది ఆ ఫ్యామిలీ. ముఖ్యంగా ములాయంకు ఇద్దరు భార్యలు కాగా పెద్ద భార్య కుమారుడు అఖిలేష్ యాదవ్‌, చిన్న భార్య కుమారుడు ప్రతీక్ యాదవ్ మధ్య ఎప్పుడూ వివాదాలు జరుగుతునే ఉన్నాయి.

అయితే కుటుంబ కలహాలను తట్టుకుని పార్టీని దక్కించుకోవడంలో సఫలమయ్యారు అఖిలేష్ యాదవ్. కొంతకాలంగా అన్నితానై పార్టీని నడిపిస్తున్నారు. దీంతో అఖిలేష్‌ పై కోపంతో ప్రతీక్‌ ఆయన భార్య అపర్ణ యాదవ్ బీజేపీలో చేరారు. ఇక తాజాగా ములాయం మరణంతో మైన్‌పురి లోక్ సభ స్ధానానికి ఉప ఎన్నిక అనివార్యం కాగా ఎస్పీ నుండి అఖిలేష్ భార్య డింపుల్, బీజేపీ నుండి ప్రతీక్ భార్య అపర్ణ బరిలోకి దిగుతున్నారు. దీంతో వీరిద్దరిలో ఇప్పుడు ఎవరు పైచేయి సాధిస్తారన్న దానిపై యూపీలో చర్చ జరుగుతోంది.

2012లో కన్నౌజ్ లోక్ సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందినప్పటి నుంచి డింపుల్ యాదవ్.. మ్రుధు స్వభావిగా పేరు తెచ్చుకున్నారు. అయితే అపర్ణ తీరు ఇందుకు విరుద్ధం. నిత్యం వివాదాస్పదవ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలుస్తుంటారు. అయితే డింపుల్, అపర్ణ ఇద్దరూ ఉత్తరాఖండ్ రాష్ట్ర ఆడబడుచులే కావడం విశేషం. ఇక 2022లో అసెంబ్లీ ఎన్నికలు జరుగగా మైన్‌పురిలో ఐదు అసెంబ్లీ స్ధానాలు మైన్‌పురి,భోంగాన్,కిష్ణి,కర్హాల్, జస్వంత్ నగర్ ఉన్నాయి. ఇందులో కర్హాల్, క్రిష్ణి,జశ్వంత్ నగర్ స్ధానాల్లో ఎస్పీ గెలుపొందగా మైన్‌పురి,భోంగాన్ స్ధానాల్లో బీజేపీ విజయం సాధించింది.

ఉత్తర ప్రదేశ్‌లో 2 అసెంబ్లీ, ఒక లోక్‌సభ సీటుకు డిసెంబరు 5వ తేదీన ఉప ఎన్నిక జరగనుంది. ఖైతౌలి, రాంపూర్‌ అసెంబ్లీ నియోజక వర్గాలకు, మైన్‌పురి లోక్‌సభ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. మైన్‌పురి ఎంపీ, సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌ మృతి చెందడంతో ఉప ఎన్నిక నిర్వహించాల్సి వస్తోంది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -