గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ప్రభుత్వం టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సిరికొండ మధుసూదనా చారిని నామినేట్ చేసింది. గవర్నర్ డాక్టర్ తమిళసై సౌందర్ రాజన్ ఆమోదంతో గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. దీంతో సాధారణ పరిపాలన శాఖ ఎన్నికల విభాగం ఆయనను ఎమ్మెల్సీగా నామినేట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఉన్న మాదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి పదవీకాలం జూన్ 16, 2021 తో ముగిసింది. దీంతో ఆ ఖాళీ భర్తీ చేయాల్సిందిగా ప్రభుత్వం గవర్నర్ ను కోరింది. శ్రీనివాస్ రెడ్డి స్థానంలో సిరికొండ మధుసూదనా చారిని నామినేట్ చేస్తూ మంత్రివర్గ ఆమోదంతో ప్రభుత్వం ప్రతిపాదన పంపింది. మంత్రివర్గ నిర్ణయాన్ని ఆమోదించిన గవర్నర్ తమిళసై సంబంధిత ఫైల్ పై సంతకం చేశారు. ఈలోపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడటంతో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. దీంతో ఉత్తర్వుల ప్రక్రియలో జాప్యం జరిగింది. ఈ క్రమంలో ఇదే అంశంపై తెలంగాణా చీఫ్ ఎలక్టోరల్ అధికారి శశాంక్ గోయల్ కేంద్ర ఎన్నికల సంఘం అనుమతిని కోరుతూ లేఖ రాశారు. బదులుగా సీఈసీ నుంచి క్లియరెన్స్ రావడంతో ఇవాళ గెజిట్ నోటిఫికేషన్ వెలువరించింది. అందుకు అనుగుణంగా సాధారణ పరిపాలన శాఖ ఎన్నికల విభాగం ఉత్తర్వులు జారీ చేసింది.
దీంతో త్వరలోనే మధుసూదనా చారి ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గవర్నర్ కోటాతో పాటు ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీల 6 ఖాళీలను ప్రభుత్వం ఈ మధ్యనే భర్తీ చేసింది. ప్రస్తుతం ఎమ్మెల్సీగా నామినేట్ అయిన మధుసూదనా చారి తెలంగాణా రాష్ట్ర సమితి సీనియర్ నాయకుల్లో ఒకరు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత వరంగల్ జిల్లా భూపాలపల్లి నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై తొలి అసెంబ్లీ సభాపతిగా బాధ్యతలు నిర్వర్తించారు. సమైక్య రాష్ట్రంలో శాయంపేట నుంచి 1 సారి, తెలంగాణా ఏర్పడ్డాక భూపాలపల్లి నుంచి మరోసారి మొత్తం 2 సార్లు మధుసూదనా చారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు.