కేరళ పర్యటక శాఖ మంత్రి కడకంపల్లి సురేంద్రన్ మలయాళ నటులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.. భారీ వర్షాలు, వరదలు కేరళను అతలాకుతలం చేశాయి. భారీ ఎత్తున ప్రాణ, ఆస్తి నష్టం సంభవించింది. లక్షలాది మంది నిరాశ్రయులు అయ్యారు. ఈ నేపథ్యంలో వీరిని ఆదుకునేందుకు ఎందరో సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు ఆర్థికంగా సాయం చేశారు. అయితే రాష్ట్రాన్ని మలయాళ నటులకంటే తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన హీరోలే ఎక్కువ నగదు సాయం చేశారని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ అన్నారు. ఇక కేరళ బాధితుల సంరక్షణ నిమిత్తం ‘కేర్ కేరళ’ అనే కార్యక్రమాన్ని ప్రభుత్వం సోమవారం ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో కేరళ పర్యాటక శాఖ మంత్రి సురేంద్రన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ..`కేరళ రాష్ట్రంలో చాలా మంది సూపర్ స్టార్లు ఉన్నారు. వారు ఒక్కో సినిమాకు దాదాపు నాలుగు కోట్ల రూపాయలు తీసుకుంటారని విన్నాను. వీరందరూ తెలుగు హీరో ప్రభాస్‌ను చూసి నేర్చుకోవాలి. అతను ఇప్పటివరకు ఒక్క మలయాళ సినిమా కూడా చేయలేదు. అయినా కేరళ కోసం ఏకంగా కోటి రూపాయల భారీ విరాళం ప్రకటించాడు. వరదల గురించి తెలిసిన వెంటనే సహాయం చేయడానికి ప్రభాస్ ముందుకు వచ్చారు` అని సురేంద్రన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ప్రభాస్ సాహో సినిమాతో బిజీ ఉన్న సంగతి తెలిసిందే.