తెలుగులో ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంటున్న హీరోయిణ్ లావణ్య త్రిపాఠి. ఆమె నటించిన సినిమాలైతే హిట్ అవ్వడంలేదు కానీ, అవకాశాలు మాత్రం లావణ్యకి బాగానే వస్తున్నాయి. ఆమె నటించిన ‘ఉన్నది ఒకటే జిందగీ’ చిత్రం తాజాగా రిలీజైన విషయం తెలిసిందే. అయితే లావణ్య త్రిపాఠిపై కోలీవుడ్ మీడియాలో ఓ న్యూస్ హల్‌చల్ చేస్తోంది. అక్కడి నిర్మాతల మండలి ఆమెకు రూ. 3 కోట్ల రూపాయల జరిమానా విధించినట్లుగా కోలీవుడ్ మీడియాలో వినిపిస్తుంది. తెలుగులో విజయవంతమైన ‘100% లవ్’ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అయితే, ఈ సినిమా చేస్తానని చెప్పిన లావణ్య త్రిపాఠి, కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు నుంచి తప్పుకుంది. ప్రస్తుతం ఆమె స్థానంలో ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ శాలిని పాండే నటిస్తోంది. దీంతో లావణ్య వల్ల తాము చాలా నష్టపోయామని… రూ. 3 కోట్ల నష్టపరిహారాన్ని తమకు ఇప్పించాలని నిర్మాతలు అక్కడి కౌన్సిల్ ను కోరినట్టు, ఆ మేరకు ఆమెపై జరిమానా విధించినట్టు తమిళ మీడియాలో వార్తలు వెలువడుతున్నాయి.
ఈ వార్తలపై డెహ్రాడూన్ బ్యూటీ లావణ్య స్పందించింది. కోలీవుడ్ నిర్మాతల సంఘం తనపై రూ. 3 కోట్ల జరిమానా విధించినట్టు వచ్చిన వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని ఆమె తెలిపింది.