కన్నడ చిత్రపరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కన్నుమూశారు. ఈ ఉదయం తీవ్ర గుండెపోటుకు గురైన పునీత్ రాజ్ కుమార్ బెంగళూరు విక్రమ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయనను బతికించేందుకు వైద్యులు అత్యంత తీవ్రంగా శ్రమించినా ఫలితం లేకపోయింది. అభిమాన హీరో మరణాన్ని తట్టుకోలేక అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. పునీత్ రాజ్ కుమార్‌ను కడసారి చూసుకునేందుకు అభిమానులంతా తరలివస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ పలువురు సెలబ్రెటీలు ట్వీట్ చేస్తున్నారు. పునీత్ రాజ్ కుమార్ కుటుంబంతో మంచు మోహన్ బాబు కుటుంబానికి కాస్త సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయనకు నివాళులు అర్పిస్తూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. ‘అయ్యో దేవుడా.. ఇది నిజం కాకూడదు. అసలు ఇదెలా జరిగింది..? పునీత్ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలి. ఎంతో భవిష్యత్ ఉన్న ఆయనకు ఇలా జరిగి ఉండకూడదు’ అంటూ మంచు లక్ష్మి ట్వీట్ చేశారు.