ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి సర్వేకి ఉన్న క్రేజే వేరు. ఎన్నికలు వచ్చాయంటే తెలుగు రాష్ట్రాల్లో అందరి దృష్టిని ఆకర్షించేంది లగడపాటే. ఎందుకంటే ఒక్క తెలంగాణ ఎన్నికల్లో తప్పా ఇప్పటివరకు ఆయన చెప్పిన సర్వేలన్ని నిజమయ్యాయి. ఈ నెల 19న సార్వత్రిక ఎన్నికల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లగడపాటి ఏం చెబుతారు..? అనే సందేహాలు అందరిలో నెలకొన్నాయి.
తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని తప్పుగా చెప్పి, తన క్రెడిబులిటీని దెబ్బతీసుకున్న లగడపాటి ఈసారి మాత్రం ఖచ్చితమైన సర్వే చేయించారని తెలుస్తోంది. ఏపీ ఎన్నికలు,కేంద్రంలో ఎవరు అధికారంలోకి రాబోతున్నారనే దానిపై లగడపాటి చెప్పింది తప్పైతే వ్యక్తిగతంగా ఆయనకు ఇబ్బందికర పరిస్థితులే ఎదురయ్యే అవకాశం ఉంది. ఎక్కువ సమస్యలే తలెత్తే అవకాశాలు ఉండటంతో… క్షేత్రస్థాయిలో ఎక్కువ దృష్టి పెట్టి మరీ సర్వేలు చేయించినట్లు తెలిసింది.
పాలిటిక్స్‌కి దూరమైనా ఇప్పటివరకు ఒక్క సర్వే మినహా ఆయన చెప్పిందే జరిగింది. 2015లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు, 2018లో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో లగడపాటి చెప్పినట్లుగానే దాదాపు దగ్గరగా వచ్చాయి ఫలితాలు.
ఆర్‌జీ ఫ్లాష్ టీంగా పిలిచే రాజగోపాల్ టీం దాదాపు 5 సార్లు సర్వే చేసినట్లు తెలిసింది. ఎక్కువ శ్రద్ధ పెట్టి ప్రజల నాడిని పట్టుకునేందుకు గట్టిగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. ఈసారి ఆయన ఫలితాలు తప్పైతే ఇక లగడపాటి సర్వేని పట్టించుకునే వారే ఉండరు. ఓవరాల్‌గా ఇప్పటికే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన ఈ మాజీ ఎంపీ ఒకవేళ ప్రీ పోల్ సర్వేలో వెల్లడించే అంశాలకు ఎన్నికల ఫలితాలకు తేడా ఉంటే ఆయన సర్వేలకు గుడ్ బై చెప్పక తప్పకదని పలువురు విశ్లేషిస్తున్నారు.