సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలిటరీ అథారిటీ ఇష్టారీతిన రోడ్లను మూసివేయడంతో లక్షలాది మంది నగర వాసులకు తీవ్రమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయని, కంటోన్మెంట్ రోడ్లు మూసివేయకుండా స్థానిక మిలటరీ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్‌ను , తెలంగాణ రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే. తారకరామారావు కోరారు. ఈ రోడ్ల మూసివేత అంశానికి సంబంధించి పలు సార్లు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చామని, గతంలోనూ ఈ విషయంలో తగిన చర్యలు తీసుకోవాలని లేఖలు రాసిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తాజాగా లోకల్ మిలిటరీ అథారిటీ తన పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్, వెల్లింగ్టన్ రోడ్, ఆర్డినెన్స్ రోడ్ వంటి కీలకమైన నాలుగు రోడ్లను కోవిడ్ కేసుల పేరు చెప్పి మూసి వేసిందని, ఈ మూసివేత లక్షలాదిమందికి అనేక ఇబ్బందులు తీసుకువస్తుందని కేటీఆర్ అన్నారు. పదే పదే ఇలా రోడ్లను మూసివేయడంతో నగర ప్రజలు అనేక కిలోమీటర్లు అదనంగా తిరిగి తమ ఇళ్లకు చేరుకుంటున్నారని కేటీఆర్ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం మే, జూన్ నెలల్లో తీసుకున్న కొవిడ్ నియంత్రణ చర్యల వలన రాష్ట్రంలో కరోనా కేసులు చాలా వరకు తగ్గాయని, ప్రస్తుతం అదుపులో ఉన్న కరోనా పేరు చెప్పి తాజాగా మరోసారి రోడ్ల మూసివేతకు పాల్పడడం అత్యంత బాధాకరమని కేటీఆర్ అన్నారు. లోకల్ మిలటరీ అథారిటీ, స్థానిక కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడుతోందని, కంటోన్మెంట్ యాక్ట్‌లో ఉన్న సెక్షన్ 258కి ఇది పూర్తి విరుద్ధమని కేటీఆర్ తన లేఖలో రాజ్నాథ్ సింగ్‌కు గుర్తు చేశారు. కంటోన్మెంట్ బోర్డు చట్టంలో పేర్కొన్న మార్గదర్శకాల మేరకు మాత్రమే రోడ్డు మూసివేసే ప్రక్రియ ఉండాలని, అయితే తమ ఇష్టారీతిన అత్యంత చిన్న చిన్న కారణాలు చూపి పదే పదే రోడ్ల మూసివేస్తున్నారని ఈ సందర్భంగా కెటిఆర్ తెలిపారు.
గతంలో ఈ అంశాన్ని రక్షణ శాఖ దృష్టికి తీసుకురావడంతో కంటోన్మెంట్ బోర్డుకి సంబంధం లేకుండా రోడ్ల మూసివేతకు పాల్పడరాదని ఇచ్చిన ఆదేశాలను సైతం స్థానిక మిలిటరీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. ఈ విధంగా రక్షణ శాఖ కింద పనిచేసే అధికారులే, తమ శాఖ నిర్దేశించిన మార్గదర్శకాలను, సూచనలను పట్టించుకోవడం లేదన్నారు. స్థానిక మిలిటరీ అధికారుల పరిధిలో ఉన్న రోడ్లపైన ఎలివేటెడ్ కారిడార్ నిర్మించేందుకు ఇప్పటికే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కార్యదర్శితో ఒక వీడియో కాన్ఫరెన్స్ జరిగిందని, ఆ సమావేశంలో ఇందుకు సూచనప్రాయంగా అంగీకరించారని, ఈ దిశగా రక్షణ శాఖ తుది నిర్ణయం కోసం వేచి చూస్తున్నామని తెలిపారు. ఈ లోగా మిలటరీ అధికారులు పదే పదె రక్షణశాఖ ఆదేశాలను సైతం తుంగలో తొక్కుతున్నారని, ఈ విషయంలో రోడ్ల మూసివేయకుండ అదేశాలిచ్చి లక్షలాదిమంది హైదరాబాద్ నగర పౌరులకు ఊరట కల్పించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ని మంత్రి కేటీఆర్ కోరారు