ఆరోగ్య తెలంగాణే కేసీఆర్‌ ధ్యేయం:కేటీఆర్

246
ktr siricilla
- Advertisement -

బంగారు తెలంగాణ-ఆరోగ్య తెలంగాణే సీఎం కేసీఆర్ లక్ష్యమని స్పష్టం చేశారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలో ఆర్‌ఎంపీ,పీఎంపీలు ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడిన కేటీఆర్..కాంగ్రెస్,టీడీపీల వైఖరిని ఎండగట్టారు.

నాలుగేండ్లలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అభివృద్ధిని అడ్డుకునేందుకు విశ్వప్రయత్నాలు చేసిందన్నారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఎన్టీఆర్…టీడీపీని స్ధాపిస్తే ఆ పార్టీతోనే పొత్తు పెట్టుకునే నీచ స్ధాయికి దిగజారిందన్నారు. అభ్యర్థుల ప్రకటన రాకముందే కాంగ్రెస్‌లో సిగపట్లు మొదలయ్యాయని తెలిపారు. మూడు సీట్ల కోసం కోదండరాం ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని తెలిపారు. మహాకూటమి కాదు మాయకూటమి అని తెలిపారు. ఒక్కోపార్టీ ఒక్కో మేనిఫెస్టోతో ప్రజలను మోసం చేస్తున్నాయని
తెలిపారు.

కాంగ్రెస్ పార్టీలో 40 మంది ముఖ్యమంత్రులు ఉన్నారని వారికి వారి మధ్యే సయోధ్య లేదన్నారు. నాడు సోనియాను ఒక్కమాటన్నందుకే తనపై అడ్డగోలు మాటలు మాట్లాడారని కానీ చంద్రబాబు అన్న మాటలు మర్చిపోయారా అని ప్రశ్నించారు కేటీఆర్. సోనియా గాంధీ కాదు గాడ్సే,ఇటలీ మాఫియా,సోనియా అవినీతి అనకొండ అని చంద్రబాబు అన్న మాటలు మర్చిపోయారా అని మండిపడ్డారు. ముసలి నక్క కాంగ్రెస్- గుంట నక్క చంద్రబాబు ఒక్కటై ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. తెలంగాణకు అసలైన శత్రువు చంద్రబాబు-కాంగ్రెస్‌ అని దుయ్యబట్టారు కేటీఆర్.

సిరిసిల్ల జిల్లాలో 300 పడకల అత్యాధునిక ఆస్పత్రిని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కేసీఆర్ కార్యదక్షత వల్లే తెలంగాణ సాధ్యమైందన్నారు.

తెలంగాణకు గోదావరి జలాల సాధన కలగానే ఉండేదని టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుసాధ్యమైందన్నారు. సిరిసిల్ల జిల్లాలో 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. వేములవాడలో వందపడకల ఆస్పత్రి నిర్మాణం జరుగుతోందన్నారు. ప్రతీ ఏరియా ఆస్పత్రిలో 10 పడకలతో ఐసీయూలను ఏర్పాటు చేశామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం పెరిగిందన్నారు.

- Advertisement -