ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో తెలంగాణ నెం 1 స్ధానంలో నిలిచిందని మంత్రి కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో ఈ-గవర్నెన్స్ జాతీయ సదస్సును కేంద్రమంత్రి సీఆర్ చౌదరితో కలిసి ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్ పౌరసేవల కోసం ఈ వ్యాలెట్ తెచ్చామని తెలిపారు. కొద్దిరోజుల్లోనే 1.3 మిలియన్‌ల ప్రజలు ఎం వ్యాలెట్‌ను డౌన్‌లోడ్ చేసుకున్నారని తెలిపారు.
తెలంగాణ సులభతరమైన డిజిటల్ విధానాన్ని అవలంభిస్తోందని తెలిపారు. ఈ గవర్నెన్స్‌తో ప్రజలకు మరింత సేవలను అందించవచ్చని తెలిపారు. పౌరసేవల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 4500 మీసేవా కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. బహుళ అంతస్థుల భవనాల నిర్మాణాలలోనూ సులభతరమైన విధానాన్ని అవలంబిస్తున్నామని చెప్పారు.
టెక్నాలజీ వాడకం ద్వారా పౌరసరఫరాల శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేశామని చెప్పారు. 86 సంవత్సరాల తర్వాత భూ రికార్డుల ప్రక్షాళన చేపట్టామని చెప్పారు. భూములన్నీ ఆధార్‌కు అనుసంధానం చేయబోతున్నామని చెప్పారు. టీఎస్ ఐ పాస్‌తో 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులిస్తున్నామని చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భవనాలకు నిర్దిష్ట కాల పరిమితిలో అనుమతులు జారీ చేయడమే కాదు ఆలస్యం చేసిన అధికారులపై చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. టీ పైబర్‌తో ప్రతి ఇంటికీ ఇంటర్నెట్ సౌకర్యం తీసుకొస్తామని చెప్పారు.
కేంద్రమంత్రి సీఆర్ చౌదరి మాట్లాడుతూ.. ఈ సదస్సు నిర్వహణకు తెలంగాణ ప్రభుత్వం ఎంతో సహకరించిందని తెలిపారు. ఇలాంటి గొప్ప సదస్సు నిర్వహిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ఆయన అభినందనలు చెప్పారు. ప్రజలకు మెరుగైన, పారదర్శక పాలన అందాలన్నారు. ప్రజలకు చేరువయ్యే పథకాలు రావాలని పేర్కొన్నారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా నినాదంతో ముందుకు వెళ్తున్నామని వెల్లడించారు. లక్షకు పైగా గ్రామాలకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించామని స్పష్టం చేశారు. మొబైల్ వాడకంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉన్నామని తెలిపారు.