బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్,మంత్రి కేటీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ.. ఆయన పేరు బండి సంజయ్.. పెట్రోల్ ధర ఎక్కువైవందని బండిలో తిరగకుండా.. పాద యాత్ర చేస్తున్నాడంటా అని విమర్శించారు. ఆయనకు వచ్చిన సమస్య ఏంటి? ప్రజా సంగ్రామ యాత్ర ఎందుకు చేస్తున్నాడో చెప్పాలని డిమాండ్ చేశారు. గతేడాది అక్టోబర్‌లో హైదరాబాద్‌లో వరదలు వచ్చాయి.. అదే సమయంలో వరదలు వచ్చిన గుజరాత్‌కు రూ. 1000 కోట్లు, ఇంకొ చోట రూ. 500 కోట్లు ఇచ్చాం. తెలంగాణకు మొండి చెయ్యి చూపాం. అయినా తమను ఆశీర్వదించండి అని అడుగుతారా? అని కేటీఆర్ ప్రశ్నించారు
ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన రూ. 6 లక్షల కోట్ల ఆస్తులను అమ్మేస్తున్నట్లు కేంద్రం చెబుతోంది. మోదీ చెప్పినట్టు డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయింది. ఇప్పుడు బేచో ఇండియా కార్యక్రమం ప్రారంభమైంది అని కేటీఆర్ విమర్శించారు. ఇంకైమేనా ఆస్తులు మిగిలిపోతే వాటిని గుర్తించి అమ్ముదాం అని యాత్రలు చేస్తున్నారా? అని బండి సంజయ్‌ను ఉద్దేశించి ప్రశ్నించారు. ప్రజలు అయితే అదే అనుకుంటున్నారు. మౌలాలిలో 21 ఎకరాల రైల్వే భూమిని అమ్మకానికి పెడుతున్నారని వార్తలు వచ్చాయి. ఇది కూడా 6 లక్షల కోట్ల ప్యాకేజీలో భాగమే. మోదీ 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎందుకివ్వలేదు కేటీఆర్ ప్రశ్నించారు.
ఈ ఏడేండ్లలో తెలంగాణ ప్రజలు కేంద్రానికి రూ. 2 లక్షల 72 వేల కోట్లు పన్నుల రూపంలో కట్టారు. కానీ కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చింది మాత్రం రూ. లక్షా 45వేల కోట్లు మాత్రమే. ఒక్క పైసా కూడా అదనంగా ఇవ్వలేదు. ఒక్క ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వలేదు. ఏ ముఖం పెట్టుకుని పాదయాత్ర చేస్తున్నారు అని కేటీఆర్ మండిపడ్డారు. పాదయాత్రలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నర్సరీలు, వైకుంఠధామాలు చూడు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద సాగులోకి వచ్చిన పొలాలు చూడు. రైతు ముఖంలో సంతోషం చూడు, పెన్షన్లు ఆందుకుంటున్న వృద్ధుల ముఖాల్లో సంతోషం చూడాలని బండి సంజయ్‌కు కేటీఆర్ సూచించారు. బీజేపీకి ఎందుకు ఓటేయ్యాలి. ఎందుకు ఆశీర్వదించాలి. తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు.. మీ మాటలను నమ్మే స్థితిలో లేరు అని కేటీఆర్ స్పష్టం చేశారు.