తెలంగాణ ప్రభుత్వం దేశానికే ఆదర్శం..

228
minister ktr
- Advertisement -

ఈ రోజు ఫిక్కీ ఆధ్వర్యంలో జరిగిన వెబీనార్ సమావేశంలో మంత్రి కే తారకరామారావు పాల్గొన్నారు. ఇందులో భాగంగా రీబిల్డింగ్ ఆండ్ రీబుటింగ్ తెలంగాణ ఎకానమీ పోస్ట్ కోవిడ్ 19 పేరుతో జరిగిన ఈ సమావేశంలో తెలంగాణలో కరోనా పరిస్థితుల అనంతరం తెలంగాణ ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ముందుకు సాగించాలనే అంశంపైన మంత్రి కేటీఆర్ మాట్లాడారు. లాక్‌డౌన్ పరిస్థితులు ఏర్పడిన నాటి నుంచి తెలంగాణలోని అన్ని రకాల పరిశ్రమలకు అండగా నిలుస్తున్నమని మంత్రి కేటీఆర్ తెలిపారు. లాక్ డౌన్ లోనూ లైఫ్ సైన్సెస్ వంటి అత్యవసర సేవల కంపెనీలకు,పరిశ్రమలకు తమ కార్యకలాపాలు కొనసాగించే వెసులుబాటు కల్పించామన్నారు.

ప్రస్తుతం తెలంగాణ కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా షాపులు, కంపెనీలను తెరుస్తూ వస్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు మరిన్ని రోజులు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో కరోనా రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం ఉన్నదని కేటీఆర్‌ తెలిపారు. ఈ దిశగా అటు కంపెనీలతో పాటు ప్రజలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ వస్తున్నది.కరోనా పోరులో పౌరులు ప్రభుత్వానికి సహకరించాల్సిన సమయమిది అని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని సూక్ష్మ మరియు మధ్యతరహా కంపెనీలను (ఎంఎస్ఎంఈ) లను ఆదుకునేందుకు అవసరమైన చర్యలను చేపట్టాము. ఇందులో భాగంగా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశం నిర్వహించి వారిని ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వం తరఫున కోరామన్నారు.

 రాష్ట్రంలోని ఎంఎస్ఎంఈ లకు విద్యుత్ బిల్లులతో పాటు, ఆస్తిపన్ను విషయంలో పలు రకాల వెసులుబాటు కల్పించడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం ఉన్న సంక్షోభం లోనూ అవకాశాలను వెతకాలన్న స్ఫూర్తితో ముందుకు పోతుందన్నారు. ఈ దిశగా చైనా నుంచి తరలిపోతున్న కంపెనీలను ఆకర్షించడంతో పాటు హెల్త్కేర్ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలని తెలంగాణ భావిస్తున్నది. హెల్త్కేర్ రంగంలో ఉన్న అవకాశాలను ప్రస్తుత సంక్షోభం తెరపైకి తీసుకువచ్చింది. ఈ దిశగా మరింత మందిని ఈ రంగంలోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేయాల్సిన అవసరం ఉన్నది. హెల్త్కేర్ రంగంలో మెడికల్ డివైసెస్ తయారీ వంటి నూతన రంగాల్లో తెలంగాణ ఇప్పటికే చురుగ్గా ముందుకు పోతున్నదని కేటీఆర్‌ పేర్కొన్నారు.

కేంద్ర ప్రభుత్వం తెలంగాణ లాంటి ప్రోగ్రెసివ్ రాష్ట్రాలకు మరింత సహాయం అందించాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాద్ ఫార్మా సిటీ కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ వంటి భారీ పారిశ్రామిక పార్కులను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నది. భారతదేశం వివిధ దేశాలతో పెట్టుబడుల ఆకర్షణలో పోటీపడే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థ రికవరీ సాధ్యం అవుతుందన్న ఆశాభావం ఉన్నప్పటికీ అది సవాల్తో కూడుకున్న ఈ విషయామని మనమంతా గ్రహించాలన్నారు మంత్రి కేటీఆర్.

ఈ సందర్భంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను పలువురు ఇండస్ట్రియలిస్ట్ లు అభినందించారు. ముఖ్యంగా పరిశ్రమల విషయంలో తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి పట్ల ప్రశంసలు అందుతున్నాయి. దేశంలోని ఇతర రాష్ట్రాలకు తెలంగాణ ప్రభుత్వం ఈ విషయంలో ఆదర్శంగా నిలిచిందని పలువురు పారిశ్రామికవేత్తలు తెలిపారు.

- Advertisement -