ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ యాక్టివ్‌గా ఉండే మంత్రి కేటీఆర్.. తాజాగా ఓ కూలీని ఆదుకున్నారు. సూర్యాపేట మండలం కాసరాబాద్ గ్రామంలోని జమునానగర్ కు చెందిన అశోక్ అనే కూలీ పూరిపాకలో నివసిస్తున్నాడు. పూరిపాకలో ఉన్నప్పటికీ అశోక్ ప్రభుత్వం మంజూరు చేసిన నిధులతో మరుగుదొడ్డిని పక్కాగా నిర్మించుకున్నారు. తమకున్న కొద్దిపాటి స్థలంలో పాక వేసుకొని ఉంటున్న ఆ కుటుంబం స్వచ్ఛభారత్ స్ఫూర్తిని తీసుకొని మరుగుదొడ్డి నిర్మించుకుని పలువురికీ ఆదర్శంగా నిలుస్తోంది.
దీంతో వారిపై మీడియాలో పాకలో ఉన్నా పక్కా మరుగుదొడ్డి అంటూ కథనాలు ప్రసారమయ్యాయి. వీటిని చూసిన మంత్రి కేటీఆర్ వారిని అభినందించారు. వెంటనే కలెక్టర్ సురేంద్ర మోహన్ కు ఫోన్ చేసి, వారికి డబుల్ బెడ్ రూం నివాసం కట్టించి ఇవ్వాలని సూచించారు. కేటీఆర్ ఆదేశాలతో కలెక్టర్ సురేంద్రమోహన్ పూరిగుడిసె స్థలానికి వెళ్లి పరిశీలించారు. పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని కలెక్టర్ ఆ కుటుంబానికి హామీ ఇచ్చారు.