సోమవారం మొయినా బాద్‌లోని ప‌్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా బ్యాడ్మింటన్ అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీ సెంటర్ ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కలిసి అకాడమీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రులు జ్యోతి ప్రజల్వన చేసి జ్వాలా గుత్తాకు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. త్వరలోనే నూతన క్రీడా పాలసీపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అవుతుందని చెప్పారు. తెలంగాణ స్పోర్ట్స్ పాలసీ దేశానికే ఆదర్శంగా నిలిచేలా ఉంటుందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ర్టం క్రీడల్లోనూ నంబర్ వన్ ప్లేస్‌లో నిలవాలి. జ్వాలా అకాడమీకి క్రీడా శాఖ పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందరో యంగ్ షట్లర్లకు జ్వాలా ప్రేరణగా నిలుస్తుందన్నారు. కొత్త స్పోర్ట్స్ పాలసీ ద్వారా ఎందరో ఛాంపియన్ ప్లేయర్స్ వచ్చేలా ప్రయత్నం చేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరం స్పోర్ట్స్ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో క్రీడలకు తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.