తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల ప్రక్రియ వేగంగా జరుగుతుందన్నారు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్. సిరిసిల్ల జిల్లాలోని తంగళ్లపల్లి మండలం మండేపల్లి గ్రామంలో నిర్మించిన ఐటీఐ కళాశాల భవనాన్ని మంత్రి నాయిని నర్సింహారెడ్డి, కేటీఆర్ లు ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఈ కళాశాలలో చదివిన విద్యార్దులకు త్వరగా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందన్నారు. మండేపల్లి లో ఐటిఐ కళాశాల ప్రారంభించడంతో ఇక్కడున్న విద్యార్ధులకు మేలు జరుగుతుందన్నారు.
విద్యార్ధులకు ప్రభుత్వ ఉద్యోగాలు రాకుండా ప్రతిపక్షాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా త్వరలోనే 12వేల ఉద్యోగాలను భర్తి చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున కంపెనీలు వస్తున్నాయన్నారు. నిరుద్యోగ యవకులను ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. ప్రయివేటు రంగంలో కూడా పెద్ద మొత్తంలో ఉపాధి కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
రాష్ట్రాన్ని ఆకుపచ్చ తెలంగాణగా చేయడమే తమ లక్ష్యమన్నారు. తెలంగాణను కోటి ఏకరాల మాగాణంగా మార్చడమే తమ ముందున్న ధ్యేయమన్నారు. రాష్ట్రంలోని ప్రతిఇంటికి తాగునీరు అలాగే ప్రతి ఏకరానికి సాగునీరు అందించేవిధంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలో ఉన్న నాయకులలందరూ మెచ్చుకుంటున్నారని..కానీ ఇక్కడ ఉండే ప్రతిపక్షాలు మాత్రం ప్రాజెకట్టులపై కేసులు వేసి అడ్డుకుంటున్నారన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు చూసి విపక్షాలకు ఓటమి భయం పట్టుకుందన్నారు.