కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామికి టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ బేగంపేట్ విమానాశ్రయంలో ఘనస్వాగతం పలికారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యే బాల్క సుమన్, ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌తో పాటు పలువురు నేతలు ఉన్నారు. కేసీఆర్ దసరా సందర్భంగా ప్రకటించబోయే జాతీయ పార్టీ కార్యక్రమంలో కుమారస్వామి పాలు పంచుకోనున్నారు. ఈ నేపథ్యంలో ఒకరోజు ముందే కుమారస్వామి హైదరాబాద్ నగరానికి చేరుకున్నారు.
ఈ ఏడాది సెప్టెంబర్ 11వ తేదీన సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి ప్రగతి భవన్‌లో సమావేశమై దేశ రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించిన సంగతి తెలిసిందే. కేసీఆర్‌కు ఉన్న అపార అనుభవం ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి ఎంతో అవసరమని కుమారస్వామి అభిప్రాయపడిన విషయం విదితమే. సకల వర్గాలతో కలిసి ముందుకు సాగి, శాంతియుతంగా ఉద్యమించి తెలంగాణను సాధించి.. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కేసీఆర్ నెరవేరుస్తున్నారని కొనియాడారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటులో కేసీఆర్ క్రియాశీల భూమిక పోషించాలని కోరారు. ఇందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని కుమారస్వామి నాడే ప్రకటించారు.