తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత అభివృద్ది సంక్షేమమే ద్యేయంగా సీఎం కేసీఆర్ నాయకత్వంలో ముందుకు సాగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. గత ఎనిమిదిన్నర యేళ్ల కాలంలో తెలంగాణ ఎన్నో మైలురాలు దాటిందన్నారు. వాటి కోసం సీఎం కేసీఆర్ నిరంతరం కృషి అభినందనీయమన్నారు. ఎల్‌బీనగర్‌లో మంగళవారం మంత్రి నాగోల్ నుంచి బండ్లగూడ వరకు నిర్మించిన బాక్స్ డ్రైన్, ఫతుళ్లగూడ నుంచి పీర్జాదిగూడ లింక్‌రోడ్డు, ముక్తిఘాట్, పెంపు జంతువుల శ్మశాన వాటిక వాటికను మంత్రి ప్రారంభించారు.
తెలంగాణ వచ్చిన సమయంలో రాష్ట్ర తలసరి ఆదాయం 1.24లక్షలని, తెలంగాణ వచ్చిన ఏడేళ్లలో 2.78లక్షల తలసరి ఆదాయంతో దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో ఉందని గర్వంగా చెప్పవచ్చన్నారు. జీఎస్‌డీపీ తెలంగాణ వచ్చిన సమయంలో 5.6లక్షల కోట్లని, ఈ రోజు 11.55లక్షల కోట్లుగా ఉందన్నారు. ఛూమంతర్ అనగానే, అల్లావుద్దీన్ అద్భుత దీపంలా ఓ భూతాన్ని బయటకు తీసి పెంచమనంగనే పెరుగలేదని, నోటిమాటలు, ఊకదంపుడు ఉపన్యాసాలు, చిత్రవిత్రమైన బట్టలు వేసుకొని ఫోజులు కొడితే జరుగులేదన్నారు. ప్రణాళికా ప్రకారం, క్రమశిక్షణ, వ్యూహంతో ప్రజల అవసరాలేంది ? రాష్ట్రం ఎక్కడ ఉంది? ఎక్కడికి వెళ్లాలనే ఆలోచనతో పని చేస్తే ఇవన్నీ సాధ్యమయ్యాయని స్పష్టం చేశారు.
కేంద్రం భారతదేశంలో అత్యుత్తమ 20 గ్రామ పంచాయతీలు ఎక్కడ ఉన్నాయని సర్వే చేస్తే 19 గ్రామాలు తెలంగాణలో ఉన్నాయని స్వయంగా కేంద్రం చెబుతున్నదని, అత్యత్తుమ మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయని లెక్కదీస్తే స్వచ్ఛ సర్వేషన్ 2022 రాష్ట్రానికే అత్యధికంగా 26 అవార్డులు కేంద్రం ప్రభుత్వం ఇచ్చిందని గుర్తు చేశారు. పల్లె, పట్టణ ప్రగతితో అటు గ్రామాల్లో, ఇటు పట్టణాల్లో సమతుల్యమైన అభివృద్ధిని తెలంగాణ ప్రభుత్వం సాధించిందని కేటీఆర్ అన్నారు.
రాజకీయ నాయకులు ఎన్నడూ చెట్లు, మొక్కలు, పర్యావరణం గురించి మాట్లాడరని కేటీఆర్ అన్నారు. చెట్లకు ఓట్లు ఉండయని, వాటితో ఎక్కువ లాభం ఉండది కాబట్టి మాట్లాడరన్నారు. మనుషులకు ఓట్లుంటయ్ కాబట్టి బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తారన్నారు. కేసీఆర్ నాయకత్వంలో 240కోట్ల మొక్కలు పెట్టడం సంతోషకరమన్నారు. పంచాయతీలు, మున్సిపాలిటీ పంచాయతీల్లో గ్రీన్ బడ్జెట్ తీసుకువచ్చి హరితహారం ద్వారా 7.7శాతం గ్రీన్ కవర్ సాధించామన్నారు. 24శాతం ఉన్న గ్రీన్ కవర్ ఇవాళ 31.7శాతానికి చేరిందని, ఇది రాష్ట్రానికే గర్వకారణమన్నారు. తెలంగాణలో ఏ పల్లెకు, హైదరాబాద్‌లో ఏ మూలకు వెళ్లినా పచ్చదనం కనిపిస్తుందన్నారు.
దేశంలోని ఎక్కడా లేనివిధంగా ముక్తిఘాట్‌ను ఏర్పాటు చేసి రూ.16కోట్లతో అన్ని కులాలకు, మతాలకు చెందిన వారు ఒకే చోట దహన సంస్కారాలను సంస్కారవంతంగా చేసుకునేలా ఏర్పాట్లు తెలంగాణ ప్రభుత్వం చేసిందన్నారు. బతికి ఉనన్ని రోజులు కులం, మతం, భాష, ప్రాంతం పేరుమీద కొట్టుకూనే ఉంటామన్న కేటీఆర్.. చివరకు చనిపోయిన తర్వాత మంచిగుండాలనే చెప్పి హిందు, ముస్లిం, క్రిస్టియన్ మతాల వాందరికీ వారి ఆచారాలు, ధర్మాలకు అనుగుణంగా శ్మశాన వాటిక ఏర్పాటు చేశామన్నారు.
లక్షల సంఖ్యలో ప్రజలు హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడుతున్నారని తెలిపారు. భారతదేశం నుంచి 28 రాష్ట్రాల నుంచి వచ్చి హైదరాబాద్ అద్భుతంగా ఉందని చెప్పి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. నగరం విస్తరిస్తున్న పద్ధతుల్లో సౌకర్యాలు, మౌలిక వసతులు పెరగపోతే వెనుకబడి బెంగళూరులా మారిపోతామన్నారు. ప్రజల అభివృద్ధి, సంక్షేమాన్ని కాంక్షించి సీఎం కేసీఆర్ నాయకత్వంలో అడిగినా అడగపోయినా పని చేస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమని ఈ ఘనత సీఎం కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
ఇవి కూడా చదవండి…
మోడీకి ధీటైనా ప్రత్యర్థి కేసిఆరే !
భారతదేశ ఆస్తిత్వపు ప్రతీక..అంబేద్కర్
చలిలో వాడి-వేడి…16 కొత్త బిల్లులు