నిన్న రాజన్న సిరిసిల్ల జిల్లాలో సుడిగాలి పర్యటన నిర్వహించిన మంత్రి కేటీఆర్ ఇవాళ గ్రేటర్ హైదరాబాద్‌లో పర్యటించారు. మలక్‌పేటలో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన పార్క్‌ను ప్రారంభించారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక పార్క్‌ను ప్రారంభించుకోవడం తెలంగాణకే గర్వకారణమని కేటీఆర్ తెలిపారు. జనాభాలో 3 శాతం ఉన్న వికలాంగుల కోసం ప్రభుత్వం ఎంత చేసిన తక్కువే అని తెలిపారు. దివ్యాంగుల కోసం త్వరలోనే ప్రత్యేక ఐటీ పార్క్ ఏర్పాటు చేస్తామని …బెడ్‌రూం ఇండ్లలో దివ్యాంగులకు ఇళ్లు ఇస్తామని తెలిపారు.
నగరంలోని మలక్ పేటలో ఫ్లెక్సీలు కట్టిన నాయకులకు జరిమానాలు విధించాలని మంత్రి కేటీఆర్ ఆదేశించారు. ఇండోర్ స్టేడియం ప్రారంభంలో నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. కార్పొరేటర్ సునరితా రెడ్డి కి రూ.50 వేలు, మాజీ కార్పొరేటర్ అస్లాంకు రూ.25 వేలు, టీఆర్ఎస్ నేత శ్రీనివాస్ కు రూ.25 వేలు జరిమానా విధించారు.
ఎల్బీనగర్‌లో పర్యటించిన కేటీఆర్…దశాబ్దాలుగా హైదరాబాద్ ప్రజలు పడుతున్న మంచినీటి కష్టాలకు చరమగీతం పాడుతున్నామని స్పష్టం చేశారు. ఎల్బీనగర్ సాహెబ్‌నగర్‌లో మంచినీటి రిజర్వాయర్‌ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. రికార్డు సమయంలో హైదరాబాద్ ప్రజల నీటి కష్టాలను తీరుస్తున్నామని కేటీఆర్ తెలిపారు. నగర ప్రజలకు మంచినీటిని అందించేందుకు ఏడు రిజర్వాయర్లను నిర్మించుకున్నామని చెప్పారు.
మహానగరంలో నీటి ఎద్దడి తీర్చేందుకు రూ. 2 వేల కోట్లతో తాగునీరు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. సాహెబ్‌నగర్‌లో రిజర్వాయర్ల నిర్మాణం పూర్తవడానికి సమయం 2018 మార్చి అయినప్పటికీ.. మూడు నెలల ముందే పూర్తి చేసి తాగునీరు అందిస్తున్నామని స్పష్టం చేశారు. ప్రజలకు మేలు చేసే విషయంలో, అభివృద్ధి విషయంలో పార్టీలకతీతంగా నిధులు కేటాయిస్తున్నారని తెలిపారు.