రైతు రాజ్యం కోసం కొట్లాట :మంత్రి కేటీఆర్‌

118
- Advertisement -

కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండి రైతులను మోసం చేసిందని…నల్లా చట్టాలను తీసుకువచ్చి రైతులను చంపిన మోదీపై టీఆర్‌ఎస్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని మన్నెగూడలో ఏర్పాటు చేసిన మునుగోడు రైతు సన్నాహక సదస్సులో కేటీఆర్ పాల్గొని ప్రసంగించారు. బీజేపీని అధికారంలోకి తీసుకొస్తే.. రైతు ఆదాయం డబుల్ చేస్తానని మోదీ చెప్పిండు. ఒకే ఒక్క వ్యక్తి ఆదాయం పెరిగింది. అదానీ ఆదాయం పెరిగింది.. దేశమంతా పేదరికంలో ఉండిపోయింది. ఒక్కరో, ఇద్దరో ధనవంతులైతే దేశ సంపద పెరుగుతదని మోదీ ప్రభుత్వం అనుకుంటుందన్నారు.

నల్లగొండ జిల్లాలో రాజగోపాల్ రెడ్డి ఒక్కడు ధనవంతుడైతే మొత్తం నల్లగొండ జిల్లా అంతా బాగుపడుతదని మోదీ అనుకుంటున్నాడు. ఒక్కడు ధనవంతుడైతే దేశ సంపద పెరగదు. ఒక్క రాజగోపాల్ రెడ్డి ధనవంతుడైతే.. నల్లగొండ రైతుబిడ్డల ఆదాయం పెరగదు మోదీ. రూ. 18 వేల కాంట్రాక్ట్ మా నల్లగొండ జిల్లా అభివృద్ధికి ఇవ్వాలని చెప్పాం. పోటీ నుంచి తప్పుకుంటామని చెప్పాం. కానీ బీజేపీ నాయకుల నుంచి ఉలుకు లేదు, స్పందన లేదని కేటీఆర్ పేర్కొన్నారు.

తెలంగాణలో ఉన్నట్టు వ్యవసాయం, రైతు పథకాలు ఏ రాష్ట్రంలో కూడా లేవు అని కేటీఆర్ గుర్తు చేశారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం బాగుపడదు. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదని పెద్దలు చెప్పారు. మిగతా రాష్ట్రాల్లో రైతులు కన్నీరు పెట్టుకుంటున్నారు. రైతులు, వ్యవసాయం, సాగునీరు గురించి ఆలోచించేది కేసీఆర్ ఒక్కరు మాత్రమే. రైతుకు కులం, మతం ఉండదు. మనందరిది ఒకే కులం, మతం అని చెప్పడానికే ఆకుపచ్చ కండువాను ధరిస్తాం. ఈ కండువాను రైతుల ఓట్లు దండుకోవడానికి వాడుకున్నారు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.

రైతుల కష్టాలు అవగాహన చేసుకుని, ఆదుకున్న నాయకులు ఎవరూ లేరు. కానీ సీఎం కేసీఆర్ మాత్రమే రైతులను ఆదుకున్నారు. అనేక సంక్షేమ పథకాలు అమలు చేశారు. ఇవాళ చాలా మంది చాలా మాటలు మాట్లాడుతున్నారు. నిన్న మొన్న వచ్చినోళ్లు కూడా కేసీఆర్‌ను తిడుతున్నారు. ఒక్కసారి పదేండ్లు వెనక్కి వెళ్దాం. కాలిపోయిన మోటార్లు.. పేలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లు, కరెంట్‌ కోతలు.. చార్జీల మోతలు, పోలీసు స్టేషన్లలో విత్తనాలు.. ఎరువుల కోసం లైన్లలో చెప్పులు ఆనాటి దుస్థితి. రైతు ఆత్మహత్యలు కూడా మన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలో అధికంగా జరిగేవి.

వరిధాన్యం పండించడంలో ఉమ్మడి నల్లగొండ అగ్రభాగాన ఉందన్నారు. మా రైతు బిడ్డ సీఎం అయ్యాక రైతుల పరిస్థితి మారింది. ఇవాళ తెలంగాణలో కరెంట్ కోతల్లేవు. పదేండ్ల కింద రోజుకు పది గంటలు కరెంట్ పోతే అడిగినోళ్లు లేరు. కానీ ఇప్పుడు పది నిమిషాలు కరెంట్ పోతే పడిరానోళ్లు ఎగిరెగిరి పడుతున్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వ్యవసాయానికి ఉచితంగా కరెంట్ ఇవ్వడం లేదు. ఒకవేళ అలా ఇస్తున్న రాష్ట్రం ఉంటే చూపించాలని ప్రతిపక్ష నేతలకు కేటీఆర్ సవాల్ విసిరారు.

- Advertisement -