అమిత్‌షా అబద్ధాల పెద్దకొడుకు: కేటీఆర్‌

46
ktr
- Advertisement -

అబద్ధాలకు పెద్దకొడుకు అమిత్ షానే .. అధికార కాంక్ష తప్ప ప్రజల ఆకాంక్షలను పట్టించుకోని పసలేని ప్రసంగం చేశారని మంత్రి కేటీఆర్‌ విమర్శించారు. రూ.వేలకోట్ల పెట్టి ఎమ్మెల్యేని కొన్నట్టుగా.. తెలంగాణ ప్రజల ఆత్మాభిమానానికి బీజేపీ ఖరీదు కట్టలేరన్నారు. అయితే, మునుగోడు ప్రజల స్వాభిమానం ముందు బీజేపీ బట్టేబాజ్ తనం ఓడిపోవడం ఖాయమన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, ఇక్కడి ప్రజల ఆకాంక్షలను ఢిల్లీ పాదూషాలు ఎన్నటికీ అర్థం చేసుకోలేరన్న సంగతి, మునుగోడులో కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన ప్రసంగంతో మరోసారి రుజువైందని కేటీఆర్‌ అన్నారు. అమిత్ షాతో మునుగోడు ప్రజలకు పావలా ప్రయోజనం లేదన్నారు. గాడిద గాత్రానికి ఒంటె ఓహో.. అంటే, ఒంటె అందానికి గాడిద ఆహా అన్నట్టుగా మోదీ ప్రభుత్వ పనితీరు గురించి అమిత్ షా చెప్పుకున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.

నల్లా చట్టాలతో అన్నదాతల ఉసురు తీద్దామనుకున్న బీజేపీ పార్టీ నేతలు, రైతుపక్షపాతి అయిన కేసీఆర్‌ను విమర్శించడాన్ని చూసి హిపోక్రసీ కూడా ఆత్మహత్య చేసుకుంటుందని కేటీఆర్‌ అన్నారు. మొన్న నల్లచట్టాలతో దేశ రైతులకు ఉరితాడు బిగించాలనుకున్న మోదీ ప్రభుత్వం, తాజాగా విద్యుత్ చట్టంతో వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టే కుట్రలకు తెరతీసిందని కేటీఆర్ ఆరోపించారు. తెలంగాణ రైతుల నోట్లో మట్టి కొట్టేలా కేంద్రం చేస్తున్న కుట్రలపై కేసీఆర్ చేసిన ఆరోపణలకు మునుగోడు వేదికగా అమిత్ షా జవాబు చెప్తారని రైతాంగం ఆశించిందని, కానీ, ఆయన ఆ విషయాన్ని దాటవేశారన్నారు. అమిత్ షా ప్రసంగంలోని అనేక అంశాలు అసత్యాలు, అర్థరహితమన్న సంగతి వేదిక మీదున్న బీజేపీ నేతలకు కూడా తెలుసన్నారు. దేశాన్ని ఏలుతున్న బీజేపీ ప్రభుత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న అమిత్ షా నుంచి అనేక అంశాలపై తెలంగాణ ప్రజలు స్పష్టతను ఆశించారని అయితే బీజేపీకి అలవాటైన తప్పించుకునే ధోరణినే ఆయన కొనసాగించారని కేటీఆర్ విమర్శించారు.

ఒకప్పుడు తెలంగాణ కరువు సీమగా ఉంటే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పచ్చని పంటలతో సస్య శ్యామలం అయ్యాయని కేటీఆర్ చెప్పారు. వడివడిగా ప్రాజెక్టులను కట్టి తెలంగాణను జలభాండాగారంగా మార్చడంతో పాటు రైతులకు ఇచ్చిన అనేక ప్రోత్సాహక పథకాలతో ఇవాళ రాష్ట్రంలో అద్భుతమైన వ్యవసాయ ప్రగతి కొనసాగుతుందన్నారు. దేశ వ్యవసాయరంగానికి నూతన దిక్సూచిగా అనేక విప్లవాత్మకమైన పథకాలను అమలుచేస్తున్న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు రైతు వ్యతిరేకి అని అమిత్ షా మాట్లాడడం ఆయన అవగాహన రాహిత్యానికి, కళ్లుండి చూడలేని కబోదితనానికి నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. ఈ దేశ రైతులకు ఏం చేయాలన్న విషయాలపై అస్సలు అవగాహన లేని మోదీ ప్రభుత్వానికి ఓ దారి చూపించింది ముఖ్యమంత్రి కేసీఆరే అన్న సంగతిని అమిత్ షా మర్చిపోయారని కేటీఆర్ చెప్పారు. తెలంగాణ రైతుబంధు పథకాన్ని పేరు మార్చి పీఎం కిసాన్‌ అమలుచేస్తున్న సంగతిని అమిత్ షా గుర్తుంచుకోవాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం సాధిస్తున్న ప్రగతిని రోజుకో కేంద్ర ప్రభుత్వ సంస్థే ప్రశంసిస్తున్న సంగతి అమిత్ షాకి తెలియకపోవడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.

అన్నదాతకు వెన్నుదన్నుగా నిలబడ్డది తెలంగాణ ప్రభుత్వం అయితే, రైతన్నల వెన్ను విరుస్తున్నది మీరు కాదా? అని నిలదీశారు. నల్ల చట్టాలతో 13 నెలల పాటు రైతులను వేధించి వారి ప్రాణాలను బలిగొన్న ప్రభుత్వంలో కీలక మంత్రి అయిన అమిత్ షా, తెలంగాణ రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారని కేటీఆర్ విమర్శించారు. దేశ రైతాంగం చేసిన వీరోచిత పోరాటంతోనే మోదీ అండ్ టీం అధికార మదం దిగి, అన్నదాతలకు బహిరంగ క్షమాపణ చెప్పిన విషయాన్ని అమిత్ షా మర్చిపోయినట్టున్నారని కేటీఆర్ అన్నారు. లఖింపూర్‌లో రైతుల నెత్తురు కండ్లజూసిన ఖూనీకోరు.. సర్కారు మీదని, రైతు గురించి మాట్లాడే అర్హత మీకెక్కడిదని ప్రశ్నించారు.

తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని గుజరాత్ రాజకీయ వ్యాపారుల ముందు తాకట్టు పెట్టిన గల్లీ నాయకులను చరిత్ర క్షమించదన్నారు. ఆత్మాభిమానంలేని కొందరు తొత్తులు.. మీ చెప్పులు మోయొచ్చుగానీ.. తెలంగాణను చెప్పు చేతల్లో పెట్టుకోవాలని మీరు చేస్తున్న కుట్రలకు.. ఆత్మగౌరవం వున్న తెలంగాణ జాతి ఎప్పుడూ లొంగదనే విషయాన్ని గుర్తుంచుకోండి అని కేటీఆర్‌ హెచ్చరించారు. వేల కోట్ల కాంట్రాక్టులతో ఒక ఎమ్మెల్యేను కొన్న బీజేపీ పార్టీ, మునుగోడు నియోజకవర్గానికి ప్రత్యేకంగా కోట్లాది రూపాయల ప్యాకేజీ ప్రకటిస్తుందని అంతా ఆశించారన్న కేటీఆర్, గోల్ మాల్ గుజరాత్‌కు తప్ప గోల్డ్ మోడల్ తెలంగాణకు రూపాయి ఇచ్చే సంస్కారం ఆ పార్టీకి లేదన్నారు. అమిత్ షాలాంటి నాయకులు తెలంగాణ గడ్డమీద అసత్యాలతో ప్రచారం చేసినా ఇక్కడి ప్రజలు నమ్మరన్న కేటీఆర్, తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవానికి అండగా నిలబడే టీఆర్ఎస్ పార్టీకే మద్దతుగా ఉంటారన్న విషయం మునుగోడు ఎన్నికతో బీజేపీ నేతలకు అర్థం అవుతుందన్నారు కేటీఆర్.

తెలంగాణ కర్షకుడి మీద కక్షగట్టింది నిజం కాదా..? మోటర్లకు మీటర్లు పెట్టి .. ఉచిత కరెంట్‌ను కబళించే కుట్రలు చేస్తున్నది మీరు కాదా..? కృష్ణా జలాల్లో వాటాలు తేల్చకుండా నికృష్ట రాజకీయం చేస్తున్నది మీరు కాదా..? నీళ్లిచ్చే ప్రాజెక్టులను నిలిపివేయడానికి బోర్డులు బెట్టి బోడిపెత్తనం చేస్తున్నది మీరు కాదా..? అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతి కిలో దొడ్డు బియ్యాన్ని కొంటామంటున్న అమిత్ షా.. ఇప్పుడు అధికారంలో ఉన్నది తమ పార్టీనే అన్న విషయాన్ని మర్చిపోయారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. రాజకీయ ప్రయోజనం లేదన్న ఒకే ఒక్క కారణంతో కావాలనే తెలంగాణ రైతులు పండించిన ధాన్యాన్ని కొనకుండా ఇక్కడి రైతాంగాన్ని గోస పెట్టుకుంటున్న బీజేపీ నేతల మాటలను ఎవరూ నమ్మరని కేటీఆర్ చెప్పారు. పండించిన పంటను కొనకుండా తొండి షరతులు పెట్టి వేధిస్తున్న రైతు ద్రోహులు బీజేపీ నేతలే అన్నారు. ఏనాటికైనా బీజేపీ వాళ్లు తెలంగాణ ప్రజల అవసరాలను ఆకాంక్షలను అర్థం చేసుకోలేరని మునుగోడు సభ ద్వారా నిరూపితమైందని కేటీఆర్‌ అన్నారు.

- Advertisement -