మెదక్ పార్లమెంటరీ నియోజకవర్గ సన్నాహాక సమావేశంలో ఆసక్తికర పరిణామాం చోటుచేసుకుంది. ఈ సమావేశంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మెదక్ జిల్లా నేతలకు సవాల్ విసిరారు. మెదక్ పార్లమెంట్ కంటే కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోనే ఎక్కువ మెజార్టీ సాధిస్తామని స్పష్టం చేశారు.
తెలంగాణ ఏమి ఆలోచిస్తదో.. భారత్ అదే ఆలోచించే పరిస్థితి వచ్చిందన్నారు. సీఎం కేసీఆర్ సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ సమానంగా నడిపిస్తున్నారని చెప్పారు. మోడీ పాలన పట్ల ప్రజల్లో విముఖత ఉందని చెప్పిన కేటీఆర్ 16 మంది టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించి ఢిల్లీకి పంపితే ఎర్రకోటపై తెలంగాణ జెండా ఎగరేస్తామన్నారు. కాంగ్రెస్,బీజేపీ ఏనాడూ రైతులకు మేలు చేసే పథకాలను చెపట్టలేదన్నారు.
ప్రస్తుతం తెలంగాణలో పోటీ కాంగ్రెస్, బీజేపీకి, టీఆర్ఎస్ మధ్య లేదని పోటీ ఉన్నదంతా టీఆర్ఎస్‌లో ఒకరితో ఒకరు మెజార్టీలు సాధించే దానిపైనే ఉందన్నారు. కరీంనగర్, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గాల కంటే ఎక్కువ మెజార్టీని సాధించాలని హరీష్ రావు అన్నారని కానీ తాను కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని సిరిసిల్ల నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నానని నేను కూడా సవాల్ చేస్తున్నా. మా కంటే ఎక్కువ మెజార్టీ తీసుకువచ్చి రుజువు చేసుకోవాలన్నారు.
బావ హరీష్‌తో కాదు.. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గం కంటే మేమే ఒక్క ఓటన్న ఎక్కువ తెచ్చుకొని మీ కంటే ముందుంటామని… బావ మేమంతా మంచిగానే ఉన్నామని కేటీఆర్ చెప్పడంతో సభలో చప్పట్లు మార్మోగాయి.