అనుముల కొండల్ రెడ్డిపై బీఆర్ఎస్ నాయకుడు మన్నె క్రిశాంక్ సంచలన ఆరోపణలు చేశారు. ఇన్కమ్ ట్యాక్స్ చెల్లించకుండా తప్పించుకునేందుకు కొండల్ రెడ్డి తనకు మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పారని ఆరోపించారు. అలాంటి వ్యక్తికి టెసెరాక్ట్ సంస్థ పేరుతో సుమారు రూ.200 కోట్ల విలువైన భూమిని ఎలా కేటాయించారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ.. 2023లో రుణం చెల్లించలేదంటూ హెచ్డీఎఫ్సీ బ్యాంకు అధికారులు కొండల్ రెడ్డి ఇంటికి నోటీసులు ఇచ్చారని పేర్కొన్నారు. 2025 నవంబర్ 26న ఆదాయపు పన్ను చెల్లించలేదనే కారణంతో ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ ఆయనపై కేసు వేశారని తెలిపారు. అయితే, ఈ వ్యవహారంలో తనకు మెమరీ లాస్ ఉందని కోర్టుకు చెప్పి తప్పించుకున్నారని ఆరోపించారు. మెడికవర్ ఆసుపత్రి నుంచి మెమరీ లాస్ సర్టిఫికెట్ తీసుకున్నారని క్రిశాంక్ వెల్లడించారు.
మెమరీ లాస్ ఉందని చెప్పిన వ్యక్తికి టెసెరాక్ట్ సంస్థ పేరుతో రూ.200 కోట్ల విలువైన భూమిని కట్టబెట్టడంలో ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.మరోవైపు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కూడా మన్నె క్రిశాంక్ విమర్శలు గుప్పించారు. పంజాబ్ ముఖ్యమంత్రి మద్యం సేవించి పార్లమెంట్‌కు వచ్చారని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయాన్ని ప్రస్తావించారు. మరి ఢిల్లీలో ఓ మంత్రి, ఎమ్మెల్యే మద్యం మత్తులో గొడవ పడితే రాహుల్ గాంధీ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
Also Read:ఓనర్ ఫోటోతో ఫేక్ మెసేజ్..రూ.కోటి స్వాహా!
తమ పార్టీకి సంబంధించిన వ్యవహారాలపై రాహుల్ గాంధీ మౌనం వహించడం ఏమిటని నిలదీశారు. ఇతర పార్టీల నాయకులపై విమర్శలు చేసే ముందు కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపైనా స్పందించాలని క్రిశాంక్ వ్యాఖ్యానించారు.

