ప్రముఖ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్ తన ఆండ్రాయిడ్ యూజర్ల కోసం మరో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. అదే చాట్ ప్రివ్యూ ఫీచర్. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే చాట్‌ను ఓపెన్ చేయకుండానే అందులోని మెసేజ్‌లను చదువుకోవచ్చు. ప్రస్తుతం ఐఫోన్ యూజర్లకు ఈ సదుపాయం అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్ యూజర్ల కోసం అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.
వాట్సాప్ చాట్ లిస్ట్‌లో ఏదైనా ఒక చాట్‌పై ఎక్కువసేపు (Long Press) నొక్కితే ప్రివ్యూ విండో కనిపిస్తుంది. అందులో ఇటీవల వచ్చిన మెసేజ్‌లను చూడటంతోపాటు స్క్రోల్ చేసి మరిన్ని మెసేజ్‌లను చదువుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా చాట్‌లోకి వెళ్లాల్సిన అవసరం ఉండదు. దీంతో చాట్‌ను ఓపెన్ చేయకుండా మెసేజ్‌ల వివరాలు తెలుసుకోవచ్చు.
ఈ చాట్ ప్రివ్యూ విండోలో మెసేజ్‌లు చదవడమే కాకుండా మరికొన్ని సదుపాయాలు కూడా ఉండనున్నాయి. చాట్‌ను రీడ్‌గా మార్క్ చేయడం, పిన్ చేయడం, ఆర్కైవ్ చేయడం, సెలెక్ట్ చేయడం, డిలీట్ చేయడం వంటి ఆప్షన్లు అందుబాటులోకి రానున్నాయి.
అంతేకాకుండా ‘మోర్ ఆప్షన్స్’ మెనూలో మరిన్ని ఫీచర్లు ఉండనున్నట్లు సమాచారం. చాట్‌ను లాక్ చేయడం, లిస్ట్‌లో చేర్చడం, చాట్ వివరాలు తెలుసుకోవడం, ఫోన్ హోమ్ స్క్రీన్‌పై చాట్ షార్ట్‌కట్‌ను క్రియేట్ చేసుకోవడం వంటి సదుపాయాలు కూడా వచ్చే అవకాశం ఉంది. దీంతో వాట్సాప్ చాట్‌లను నిర్వహించడం మరింత సులభం కానుంది.
ఈ ఫీచర్‌లో మరో ఆసక్తికరమైన అంశం ఉంది. చాట్‌ను నేరుగా ఓపెన్ చేయకుండా ప్రివ్యూ ద్వారా మెసేజ్‌లు చదివితే అవి పంపిన వారికి బ్లూ టిక్స్ వెళ్లవని సమాచారం. అంటే ఎదుటివారికి మెసేజ్ చదివినట్లు తెలియకుండానే అందులోని సమాచారాన్ని తెలుసుకోవచ్చు. ప్రైవసీకి ప్రాధాన్యత ఇచ్చే యూజర్లకు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడనుంది.
Also Read:ఓనర్ ఫోటోతో ఫేక్ మెసేజ్..రూ.కోటి స్వాహా!
ప్రస్తుతం ఈ ఫీచర్ అభివృద్ధి దశలోనే ఉంది. దీనిని ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై వాట్సాప్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. బీటా వెర్షన్‌లోకి ఎప్పుడు తీసుకొస్తారనే దానిపైనా స్పష్టత లేదు. అభివృద్ధి ప్రక్రియ పూర్తయిన తర్వాత భవిష్యత్తు అప్‌డేట్‌లో ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.
మొత్తంగా యూజర్ అనుభవాన్ని మెరుగుపరిచేందుకు మెటా ఎప్పటికప్పుడు వాట్సాప్‌లో కొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వ్యక్తిగత అవసరాలతోపాటు వృత్తిపరమైన అవసరాలకు కూడా వాట్సాప్‌ను మరింత ఉపయోగకరంగా మార్చే దిశగా ఈ మార్పులు చేపడుతోంది.

