బీజేపీపై సోనియా సంచలన వ్యాఖ్యలు

3
- Advertisement -

గత 12 ఏళ్లలో దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకు, రాజ్యాంగ సంస్థలకు, భారత సామాజిక ఐక్యతకు తీవ్ర నష్టం జరిగిందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాంధీ వ్యాఖ్యానించారు. బీజేపీ–ఆర్ఎస్ఎస్ పాలనలో దేశంలోని కీలక వ్యవస్థలు బలహీనపడ్డాయని ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వం అధికారంలో నుంచి వెళ్లిపోయినప్పటికీ, వ్యవస్థలను తిరిగి గాడిలో పెట్టడానికి చాలా సమయం, రాజకీయ పార్టీలు సమష్టిగా కృషి చేయాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

త్వరలో విడుదల కానున్న తన ఆత్మకథ ‘Belonging: A Journey of Love’ పుస్తకం నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో సోనియా గాంధీ వ్యక్తిగత జీవితం, రాజకీయ ప్రయాణం, కాంగ్రెస్ భవిష్యత్తు, దేశ రాజకీయ పరిస్థితులపై పలు అంశాలను వెల్లడించారు. ఈ పుస్తకాన్ని హార్పర్‌కాలిన్స్ ఇండియా ప్రచురిస్తోంది. నవంబర్ 10న పుస్తకం విడుదల కానుంది.

తన జీవితంపై ఇప్పటికే అనేక పుస్తకాలు, జీవిత చరిత్రలు వెలువడినప్పటికీ వాటిని చదవాలనే ఆసక్తి తనకు ఎప్పుడూ కలగలేదని సోనియా గాంధీ తెలిపారు. తన గురించి ఇతరులు ఎన్నో దశాబ్దాలుగా కథనాలు రాస్తున్నారని, ఒకానొక సమయంలో తన జీవిత అనుభవాలను తానే చెప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు.

తన ఆత్మకథ రాయడానికి పదేళ్లకు పైగా సమయం పట్టిందని చెప్పారు. సుమారు ఐదేళ్ల క్రితం నుంచి పుస్తక రచనపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టినట్లు వివరించారు. కొన్నిసార్లు ఆలోచనలు, మాటలు సులభంగా వచ్చేవని, మరికొన్ని సందర్భాల్లో ఏమీ రాయలేక నిరాశకు గురయ్యేదానినని తెలిపారు.

Also Read:‘ఇట్లు అర్జున’లో యూత్‌ఫుల్ క్యారెక్టర్ చేశా!

ప్రధాని నరేంద్ర మోదీ ఎదుగుదల నుంచి కాంగ్రెస్ ఏమైనా రాజకీయ పాఠాలు నేర్చుకోవాలా అన్న ప్రశ్నకు సోనియా స్పందించారు. మోదీ భిన్నమైన రాజకీయ, సైద్ధాంతిక నేపథ్యం నుంచి వచ్చారని అన్నారు. అయితే కాంగ్రెస్‌లోనూ డాక్టర్ మన్మోహన్ సింగ్, మల్లికార్జున ఖర్గే వంటి నాయకులు తమదైన మార్గంలో ఎదిగారని గుర్తుచేశారు. ఆర్ఎస్ఎస్ నుంచి తాము నేర్చుకోవాల్సింది ఏమీ లేదని వ్యాఖ్యానించారు.

- Advertisement -