భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మైలురాయి చేరుకున్నాడు. శ్రీలంకతో జరుగుతున్న తొలిటెస్టులో సెంచరీ సాధించిన కోహ్లి ఓవరాల్‌గా 50 సెంచరీలు చేశాడు. వన్డేల్లో 32 సెంచరీలు చేసిన కోహ్లి…టెస్టుల్లో 18 సెంచరీలు చేశాడు. వెస్టిండీస్,న్యూజిలాండ్,ఇంగ్లాండ్,బంగ్లాదేశ్‌లపై డబుల్ సెంచరీ సాధించాడు కోహ్లి.
విరాట్ కోహ్లీ (104 నాటౌట్) ,ఓపెనర్లు శిఖర్ ధావన్ (94; 116 బంతుల్లో 11×4, 2×6), లోకేశ్ రాహుల్ (79; 125 బంతుల్లో 8×4) అదరగొట్టడంతో 352/8 వద్ద రెండో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శ్రీలంకపై 231 పరుగుల ఆధిక్యం సాధించింది.
ఇప్పటివరకూ యాభై, అంతకుపైగా అంతర్జాతీయ సెంచరీలను సాధించిన భారత ఆటగాళ్లలో సచిన్ టెండూల్కర్ ముందువరుసలో ఉండగా, అటు తరువాత ఆ ఘనతను సాధించిన టీమిండియా క్రికెటర్ కోహ్లినే కావడం విశేషం. ఓవరాల్ గా ప్రపంచ క్రికెట్ లో 50 సెంచరీలను సాధించిన ఆటగాళ్లలో కోహ్లి ఎనిమిదో స్థానంలో ఉన్నాడు. అంతకుముందు సచిన్(100), రికీ పాంటింగ్(71), సంగక్కరా(63),కల్లిస్(62), జయవర్దనే(54), ఆమ్లా(54), బ్రియన్ లారా(53)లు యాభైకి పైగా అంతర్జాతీయ సెంచరీలు సాధించిన ఆటగాళ్లు.