సినిమాను తలపించిన ఉగ్రవాదుల దాడి..ఐనా దొరికిపోయాడు

275
- Advertisement -

పోలీసుల మాస్కులో వచ్చి..జైలుపై దాడి చేసి దుండగులను తప్పించడం సినిమాల్లో చూస్తుంటాం. కానీ రీయల్‌ గా కూడా ఈ సంఘటన చోటు చేసుకుంది. అచ్చం సినిమాటిక్ టైప్‌లో పది మంది సాయుధులు రావడం..జైలు సిబ్బంది కళ్లు కప్పి వారిపై దాడి చేయడం..తమ వారిని తప్పించి తీసుకెళ్లడం. ఈ సంఘటన పంజాబ్‌లోని నభా జైలు లో జరిగింది. మొత్తం పది మంది సాయుధులు, అత్యాధునిక ఆయుధాలు.. పక్కా ప్లానింగ్.. జైలు లోపల ఖలిస్తాన్ చీఫ్ సహా ఐదుగురు ఉగ్రవాదులు. వాళ్లను తప్పించేందుకు చేసిన ఆపరేషన్ మొత్తం సరిగ్గా పదే నిమిషాల్లో ముగిసిపోయింది.

Nabha-jailCapture

ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ (కేఎల్ఎఫ్) చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూను తప్పించేందుకు చేసిన ఈ ఆపరేషన్ కోసం వాళ్లంతా పోలీసు యూనిఫాంలు ధరించి వచ్చారు. తనిఖీ కోసం ఓ ఖైదీని తీసుకొచ్చామని జైలు భద్రతా సిబ్బందికి చెప్పారు. చేతులకు బేడీలు వేసి ఉన్న ఓ వ్యక్తిని తీసుకుని జైలు ప్రధాన గేటు వద్దకు వచ్చారు. దాంతో వాళ్ల వాహనాలను జైల్లోకి అనుమతించారు. టయోటా ఫార్చూనర్ సహా రెండు వాహనాల్లో వచ్చిన ఆ ఉగ్రవాదులు.. నేరుగా లోపలకు వెళ్లిపో్యారు. ఉదయం 9 గంటల సమయంలో లోపలకు ప్రవేశించిన ఆ పదిమంది.. దాదాపు వంద రౌండ్లకు పైగా కాల్పులు జరిపారు.

Harminder-Singh

తమ వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధాలతో జైల్లో భీకర వాతావరణం సృష్టించి, తమకు కావల్సిన వాళ్లను పదే నిమిషాల్లో తీసుకుని అక్కడి నుంచి పారిపోయారు. జైలు భద్రతా సిబ్బంది వద్ద అంత ఆధునిక ఆయుధాలు లేకపోవడంతో వాళ్లను ఎదిరించడం సాధ్యం కాలేదు. జైలు సిబ్బంది వద్ద ఉన్న ఓ సెల్ఫ్ లోడింగ్ రైఫిల్‌ను కూడా వాళ్లు తీసుకుపోయారు. జైల్లో ఉన్న ఖైదీలంతా టిఫిన్ చేయడానికి బ్యారక్స్ నుంచి బయటకు వచ్చే సమయం చూసుకుని సరిగ్గా అప్పుడే లోపలకు ప్రవేశించారు. ముందుగానే తమవాళ్లకు చెప్పి ఉంచడంతో.. వాళ్లు సులభంగా వీళ్ల వాహనాల్లోకి చేరుకున్నారు. కాల్పులు కొనసాగుతుండగానే ఖలిస్తాన్ ఉగ్రవాదులు తప్పించుకున్నారు.

Harminder-Singh

ఆదివారం ఉదయం పాటియాలా జైలు నుంచి తప్పించుకున్న ఖలిస్తాన్ ఉగ్రవాద చీఫ్‌ హర్మీందర్ సింగ్ మింటూ, చిన్న తప్పు కారణంగా కేవలం 48 గంటల్లోనే ఢిల్లీ, పంజాబ్  పోలీసులకు పట్టుబడిపోయాడు. తప్పించుకున్న తరువాత ఢిల్లీకి వచ్చిన ఆయన సుభాష్ నగర్ లోని తన బంధువుల ఇంటికి ఫోన్ చేసి మాట్లాడటమే మింటూను పట్టిచ్చింది. అప్పటికే ఆయన బంధువులు, మిత్రులందరి ఫోన్లపై నిఘా పెట్టిన పోలీసులు మింటూ మాట్లాడిన కాల్ ను ట్రేస్ చేసి, ఆపై ఆయన అక్కడికే వస్తున్న విషయం పసిగట్టి అరెస్ట్ చేసినట్టు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీస్ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

అరెస్ట్ చేసిన మింటూను ఢిల్లీ కోర్టులో ప్రవేశపెట్టి, ఆపై ట్రాన్సిట్ రిమాండ్ పై పంజాబ్ పోలీసులకు అప్పగిస్తామని వెల్లడించారు. పది ఉగ్రవాద కేసులలో నిందితుడైన కేఎల్ఎఫ్ చీఫ్‌ను పట్టుకోవడం అప్పట్లో పంజాబ్ పోలీసులకు పెద్ద విజయమే. అయితే.. పారిపోయిన మింటూను మళ్లీ పట్టుకోవడంతో కొంతవరకు ఊపిరి పీల్చుకున్నారు. మరో ఐదుగురు ఖలిస్థాన్ ఉగ్రవాదుల జాడ మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -