దేశంలో కొనసాగుతున్న పేపర్ లీక్‌ల వివాదంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రధాని నరేంద్ర మోదీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మీ పాలనలోనే దేశంలోని విద్యా వ్యవస్థ తీవ్రంగా ధ్వంసమైందని ఆరోపించారు. పేపర్ లీక్‌ల వ్యవహారానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను వెంటనే పదవి నుంచి బర్తరఫ్ చేయాలని ఖర్గే డిమాండ్ చేశారు.
ప్రధాని మోదీ హయాంలో దేశంలో విద్యా వ్యవస్థ పునాదులే కదిలిపోయాయని, పారదర్శకత పూర్తిగా లోపించి లక్షలాది మంది విద్యార్థులు, అభ్యర్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందని ఖర్గే తీవ్రంగా విమర్శించారు. పేపర్ లీక్‌లపై ప్రభుత్వం కేవలం మాటలకే పరిమితం కాకుండా, విద్యా వ్యవస్థలో విశ్వసనీయతను పునరుద్ధరించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేస్తామని చెప్పడం విఫలమైన విధానాలను కప్పిపుచ్చుకోవడమేనని అభిప్రాయపడ్డారు.
Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం
దేశవ్యాప్తంగా పరీక్షల నిర్వహణలో వరుసగా అక్రమాలు జరుగుతున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. దీనికి బాధ్యుడిగా విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను మంత్రివర్గం నుండి వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆందోళనలకు కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష ఇండియా (INDIA) కూటమి పూర్తి మద్దతుగా నిలుస్తుందని వారందరికీ న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగేది లేదని ఖర్గే పునరుద్ఘాటించారు.

