జార్ఖండ్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (JSSC) నిర్వహించిన ఫీల్డ్ వర్కర్ (Field Worker) నియామక పరీక్షలో ఊహించని పరిణామం ఎదురైంది. సుమారు 3.22 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా కేవలం 86,444 మంది (సుమారు 25-27% మాత్రమే) హాజరయ్యారు. ఏకంగా 75% మందికి పైగా అభ్యర్థులు పరీక్షకు గైర్హాజరవడం తీవ్ర కలకలం రేపింది.
అనేకమంది అభ్యర్థులకు పరీక్ష మొదలయ్యే కొద్ది నిమిషాల ముందు మాత్రమే అడ్మిట్ కార్డ్ ఈమెయిల్ నోటిఫికేషన్లు వచ్చాయని ఆరోపిస్తున్నారు. ఉదాహరణకు ఒక అభ్యర్థికి మధ్యాహ్నం 3:00 గంటలకు గేట్లు మూసివేస్తుండగా 2:59 గంటలకు ఈమెయిల్ అందిందని పేర్కొన్నారు.
అభ్యర్థులకు వారి నివాస ప్రాంతాలకు చాలా దూరంగా (200 నుండి 250 కిలోమీటర్ల దూరంలో) పరీక్షా కేంద్రాలను కేటాయించారు. కొద్ది గంటల ముందు సమాచారం అందడంతో, అంత దూరం ప్రయాణించి సమయానికి సెంటర్ చేరుకోవడం సాధ్యపడలేదు.
2024లో 510 ఫీల్డ్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రాగా, రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈ పరీక్ష నిర్వహించారు. చివరికి నిర్వహణ లోపాల వల్ల పరీక్ష రాయలేకపోయామని అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాంకేతిక లోపాలు, కమిషన్ నిర్లక్ష్యం వల్లే తాము ఉపాధి అవకాశాన్ని కోల్పోయామని ఆందోళనకారులు మండిపడుతున్నారు. ఈ వ్యవహారంపై తక్షణమే నిష్పాక్షిక విచారణ జరిపి, నష్టపోయిన అభ్యర్థులకు మళ్లీ పరీక్ష రాసే అవకాశం (Re-exam) కల్పించాలని జార్ఖండ్ యువత డిమాండ్ చేస్తోంది.
Also Read:పేపర్ లీక్‌లపై మోదీ సంచలనం

