ఐదు పేర్లు..30 ఏళ్ల నేర చరిత్ర!

1
- Advertisement -

హిందీ చిత్రం ‘స్పెషల్ 26’ రీల్‌లో చూసిన దృశ్యాలను తలపించేలా రియల్ లైఫ్‌లో అచ్చం అలాగే బురిడీ కొట్టించిన ప్రముఖ అంతర్రాష్ట్ర నేరస్థుడు, కేరళకు చెందిన శ్యామ్ ఆంటోనీ అలియాస్ శ్యామ్ పీటర్ (64) ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. మూడేళ్లుగా పరారీలో ఉన్న ఈ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్‌ను కేరళలోని కన్నూర్ సమీపంలో మంగళూరు సీసీబీ (CCB) పోలీసులు అరెస్టు చేశారు.

శ్యామ్ పీటర్ తనను తాను నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA), ‘రా’ (RAW) లేదా నేషనల్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (NCIB) డైరెక్టర్ లేదా సీనియర్ అధికారిగా పరిచయం చేసుకునేవాడు. ఆర్థిక వివాదాలు, బ్యాంకు ఫ్రాడ్‌లు, ఐటీ సమస్యలు ఉన్న సంపన్నులను లక్ష్యంగా చేసుకుని, వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పి భారీగా డబ్బులు వసూలు చేసేవాడు.

దశాబ్దాల తరబడి ఇతడు శ్యామ్ పీటర్, శ్యామ్ ఆంటోనీ, రాహుల్ పీటర్, డ్యానీ తరక్కన్, రాజేష్ రాబిన్సన్, ఆంటోనీ ప్రాన్సిస్ వంటి పలు పేర్లతో చలామణి అయ్యాడు.ఇతనిపై కర్ణాటక (మంగళూరు, బెంగళూరు, ఉడుపి, చిక్కబళ్లాపూర్), కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్ వంటి కనీసం 8 రాష్ట్రాల్లో 17కు పైగా మోసం, బెదిరింపు (Extortion) కేసులు నమోదయ్యాయి.

2001లోనే ‘రాహుల్ పీటర్’ అనే పేరుతో ఇతనిపై ఇంటర్‌పోల్ (Interpol) రెడ్ కార్నర్ నోటీసు కూడా జారీ కావడం గమనార్హం. 2019 ఆగస్టులో మంగళూరులోని పంప్‌వెల్ ప్రాంతంలో ఉన్న ఒక లాడ్జిపై దాడి చేసిన పోలీసులు, శ్యామ్ పీటర్‌తో పాటు అతడి గ్యాంగ్ సభ్యులను మొదటిసారి అరెస్టు చేశారు.
ఆ తర్వాత కోర్టు నుండి బెయిల్ పొందిన శ్యామ్ పీటర్, సెప్టెంబర్ 2023 నుండి కోర్టు విచారణలకు హాజరుకాకుండా పరారయ్యాడు. అతనిపై పలు కోర్టులు అనేక నాన్-బెయిలబుల్ వారెంట్లు జారీ చేశాయి.

Also Read:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై పోలీసుల దమనకాండ

మంగళూరు సిటీ పోలీస్ కమిషనర్ సుధీర్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సీసీబీ పోలీసులు సుదీర్ఘ గాలింపు చర్యల తర్వాత కేరళలో శ్యామ్ పీటర్‌ను పట్టుకుని తదుపరి విచారణ నిమిత్తం మంగళూరు ఈస్ట్ పోలీసులకు అప్పగించారు.

- Advertisement -